Gold Loan | అత్యవసర పరిస్థితుల్లో చాలామంది ఆర్థిక అవసరాల కోసం బంగారాన్ని తాకట్టుపెట్టి రుణాలు తీసుకుంటారు. ఈ రుణాలు సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం బంగారం రుణాలను వడ్డీతో కలిపి అసలు కలిపి చెల్లించాల్సిందే. దాంతో చాలామంది వడ్డీతో కలిపి గడువులోగా తిరిగి చెల్లించడం ఇబ్బందికరంగా మారుతున్నది. దాంతో బంగారు ఆభరణాలు వేలానికి వెళ్లే పరిస్థితి నెలకొంది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపబోతున్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బంగారం ఆభరణాలపై తీసుకునే రుణాలను ఈఎంఐ రూపంలో చెల్లించే సదుపాయాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. బంగారు రుణాల మంజూరులో అవకతవకల నేపథ్యంలోనే ఈఎంఐ విధానం అయితే బాగుంటుందని ఆర్బీఐ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వాస్తవానికి, బంగారు ఆభరణాలపై రుణాలు ఇవ్వడంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని సెప్టెంబర్ 30న ఆర్బీఐ సర్క్యులర్లో పేర్కొంది. బంగారంపై రుణాలు అందించే సంస్థల పనితీరులో అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ గుర్తించింది. రుణాల సోర్సింగ్, మదింపు కోసం ఉపయోగించే థర్డ్ పార్టీల్లో అనేక లోపాలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఆభరణాల వేలంలోనూ పారదర్శకత లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల గోల్డ్ రుణాల్లో భారీగానే వృద్ధి ఉందని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ అభిప్రాయపడింది. వ్యవస్థీకృత రుణదాతల పోర్ట్ఫోలియో మార్చి 2025 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల ఆభరణాల రుణాలు 51 శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరినట్లు ఆర్బీఐ గణాంకాలు పేర్కొన్నాయి.