Gold-Silver | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. బుధవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్లు) రూ.500 పెరిగి రూ.60,650 వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. మంగళవారం పదిగ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.60,150 వద్ద ట్రేడయింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొనడంతో బంగారం ధరలు బుధవారం పుంజుకున్నాయి’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తులం బంగారం (24 క్యారట్లు) రూ.540 పెరిగి, రూ.60,490, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం రూ.500 పెరిగి, రూ.55,450 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ.78 వేలు పలుకుతోంది. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.540 పెరుగుదలతో రూ.60,490 పలికితే, ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.55,450 పలికింది. కిలో వెండి ధర రూ.1000 పెరుగుదలతో రూ.74,600 వద్ద ట్రేడవుతున్నది.
మరోవైపు కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.74,400 వద్దకు చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1937 డాలర్లు, ఔన్స్ వెండి 23.10 డాలర్లు పలుకుతున్నది. కోమెక్స్ గోల్డ్ ధర సైతం నాలుగు వారాల గరిష్ట స్థాయికి పెరిగింది. గాజాలో పేలుళ్ల తర్వాత దౌత్యపరమైన పరిష్కార మార్గాలు తగ్గిపోయి, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతోపాటు పసిడికి గిరాకీ పెరిగిందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఫ్యూచర్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లోనూ డిసెంబర్ డెలివరీ బంగారం కాంట్రాక్ట్ (24 క్యారట్లు) తులం ధర రూ.401 పెరిగి రూ.59,619 వద్ద నిలిచింది. గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1950.90 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.