Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల మేలిమి బంగారం రూ.100 పెరిగి రూ.51,812 వద్ద స్థిర పడింది. గురువారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.51,712గా ఉన్న సంగతి తెలిసిందే. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1931 డాలర్ల వద్ద ట్రేడయింది. కానీ, బంగారానికి భిన్నంగా వెండి కిలో ధర రూ.252 తగ్గి రూ.67,299 నుంచి రూ.67,047కు చేరుకున్నది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 0.26 శాతం తగ్గి 24.68 డాలర్ల వద్ద నిలిచిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు. ధరలు పెరుగుతాయన్న అంచనాలతోపాటు చైనాలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం ధరలు స్థిరంగా సాగుతున్నాయన్నారు. .
ఫ్యూచర్స్ మార్కెట్లో శుక్రవారం తులం బంగారం ధర రూ.181 తగ్గి రూ.51,404కు పడిపోయింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్లో ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్ట్స్ డెలివరీ ధర రూ.181 తగ్గి రూ.51,404 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయంగా బలహీన వాతావరణం నెలకొనడంతో ఇన్వెస్టర్లు సర్దుబాటుకు దిగడం వల్లే బంగారం ఫ్యూచర్స్ ధరలు తగ్గాయని బులియన్ విశ్లేషకులు అంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో న్యూయార్క్లో ఔన్స్ బంగారం ఫ్యూచర్స్ ధర 1936.60 డాలర్ల వద్ద తచ్చాడుతున్నది.
ముంబై బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.67,173 పలికింది. తులం మేలిమి బంగారం (99.9 ప్యూరిటీ) ధర రూ,51,822-51,638 మధ్య ట్రేడయింది. స్టాండర్డ్ గోల్డ్ (99.5 శాతం) బంగారం తులం ధర రూ. 51,615-51,431 మధ్య తచ్చాడింది. కోల్కతాలో కిలో వెండి ధర రూ.67,200 పలికింది. 24 క్యారట్ల బంగారం తులం రూ.52,350 పలికితే, 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.49,650గా ఉంది. 22 క్యారట్ల తులం బంగారం (హాల్మార్క్డ్) ధర రూ.50,400 వద్ద స్థిర పడింది.