న్యూఢిల్లీ, నవంబర్ 13: బంగారం మళ్లీ దూసుకుపోతున్నది. అంతర్జాతీయంగా డిమాండ్ పుంజుకోవడం, డాలర్ బలహీనపడటంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర గురువారం ఒకేరోజు రూ.3 వేలు ఎగిసి రూ.1,30,900కి చేరుకున్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగియడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని వెల్లడించింది.
వరుసగా మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు గురువారం మరో మెట్టు పైకి చేరుకున్నాయి. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ కూడా అంతే స్థాయి ఎగబాకి రూ.1,30,300గా నమోదైంది. మరోవైపు వెండి ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పుంజుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.7,700 ఎగబాకి రూ.1,69,000కి చేరుకున్నది.
బుధవారం కూడా వెండి రూ.5,540 పెరిగి రూ.1,61,300కి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో వరుసగా రెండో రోజుల్లో వెండి ఏకంగా రూ.13 వేలు పెరిగినట్టు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,236.84 డాలర్లకు చేరుకోగా, వెండి 53.86 డాలర్లకు ఎగబాకింది.