Gold Imports | పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. సుంకాల ఆందోళనల మధ్య బంగారం పెరుగుతుండడం అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరో వైపు భారత్లో బంగారం దిగుమతులు భారీగానే పెరుగుతున్నాయి. మార్చిలో బంగారం దిగుమతుల్లో భారీగా వృద్ధి నమోదైంది. ఈ ఏడాది మార్చిలో 192.13 శాతం పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతీయ కరెన్సీలో దాదాపు 38వేల కోట్లకు చేరాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే గణనీయంగా దిగుమతులు పెరిగినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. దిగుమతులు పెరగడం దేశ వాణిజ్య లోటుపై మరింత ఒత్తిడి పెరుగుతున్నది.
కరెంట్ అకౌంట్ లోటును ప్రభావితం చేసే బంగారం దిగుమతులు ఫిబ్రవరి 2025లో దాదాపు 62 శాతం తగ్గాయి. జనవరిలో 40.8 శాతం, డిసెంబర్ 2024లో 55.39 శాతం పెరిగాయి. అయితే, వెండి దిగుమతులు మార్చిలో 85.4 శాతం తగ్గి 119.3 మిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం బంగారం దిగుమతులు 27.27 శాతం పెరిగి 58 బిలియన్లకు చేరాయి. ఇది 2023-24లో 45.54 బిలియన్లుగా ఉన్నది. దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 8 శాతం. గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 11.24 శాతం తగ్గి 4.82 బిలియన్లకు చేరాయి. ధరలు నిరంతరం పెరుగుతున్నప్పటికీ పసిడి దిగుమతులు పెరగడం, బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత, దేశాల మధ్య ఉద్రిక్తతలు, కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్, ధరల పెరుగుదల సైతం దిగుమతులు పెరిగేందుకు కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
భారత్ బంగారం దాదాపు 40శాతం స్విట్జర్లాండ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నది. ఆ తర్వాత 16శాతంతో దుబాయి రెండో స్థానంలో నిలిచింది. పదిశాతంతో దక్షిణాఫ్రికా మూడోస్థానంలో ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటిన పది గ్రాముల పసిడి రూ.79,390 వద్ద ఉండగా.. ఏప్రిల్ 17 నాటికి పది గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.98,170కి చేరింది. బంగారం దిగుమతులు పెరగడం వల్ల మార్చిలో దేశ వాణిజ్య లోటు 21.54 బిలియన్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి 282.82 మిలియన్లకు చేరుకుంది. ఏప్రిల్ 11తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిలువలు 1.57 బిలయన్లు పెరిగి 677.83 బిలియన్లకు చేరుకున్నాయి. ఫారెక్స్ నిలువలు పెరుగడం వరుసగా ఆరోసారి. ఆర్బీఐ డేటా ప్రకారం.. ఫారెక్స్ నిలువలు 892 మిలియన్ డాలర్లు పెరిగి.. 574.9 బిలియన్లకు చేరాయి.