Gold Rate | బంగారం ధరలు బెంబేలిస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డుస్థాయికి చేరాయి. తాజాగా పుత్తడి ధరలు కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. సోమవారం పసిడి ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.200 తగ్గి తులానికి రూ.1,07,670కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. స్టాకిస్టులు తాజాగా అమ్మకాలు జరపడంతో 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి తులానికి రూ.1,06,800కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధరలు సైతం స్వల్పంగా పతనమయ్యాయి. అమ్మకాల ఒత్తిడిలో కారణంగా రూ.వెయ్యి తగ్గి.. కిలోకు 1.26లక్షలకు చేరుకుంది. మరో వైపు ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్, వెండి ధరలు ప్రారంభంలో ధరలు తగ్గినా.. ఆ తర్వాత కోలుకొని సరికొత్త రికార్డులను తాకాయి. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ డెలివరీకి సంబంధించిన గోల్డ్ ఫ్యూచర్స్ 0.41 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,08,175 చేరి సరికొత్త రికార్డును నెలకొల్పింది.
డిసెంబర్ ఫ్యూచర్స్ కూడా రూ. 370 పెరిగి తులానికి రూ.1.09 లక్షల మార్క్‌ని దాటింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. బంగారం ఇప్పటికీ నియంత్రణలోనే ఉందన్నారు. సోమవారం ప్రారంభంలో నష్టాల నుంచి కోలుకుందన్నారు. సురక్షితమైన డిమాండ్, వడ్డీ రేటు కోత అంచనాలు, స్థిరమైన యూఎస్ డాలర్ మద్దతుతో అధికంగా ట్రేడ్ అయ్యిందని పేర్కొన్నారు. వెండి ఫ్యూచర్స్ బలంగా పునరాగమనం చేశాయన్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం డిసెంబర్ డెలివరీకి సంబంధించిన వెండి ధర కిలోకు 1.36 శాతం పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,26,400కి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ 35.11 డాలర్లు పెరిగి ఔన్సుకు 3,621.92 చేరి సరికొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. డిసెంబర్ డెలివరీకి సంబంధించిన కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సుకు 3,662 డాలర్ల రికార్డు గరిష్టాన్ని తాకింది. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విశ్లేషకురాలు రియా సింగ్ మాట్లాడుతూ బంగారం రికార్డు స్థాయిలో పెరుగుతూనే ఉందన్నారు.
స్పాట్ ధరలు ఔన్సుకు 3,600 డాలర్లు దాటాయని.. ఫ్యూచర్స్ ధరలు ఔన్సుకు 3,650 దాటాయన్నారు. ఫెడరల్ రిజర్వ్, బలహీనంగా ఉన్న యూఎస్ లేబర్ మార్కెట్ డేటా బంగారం ర్యాలీకి మద్దతు ఇచ్చిందన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో 4 శాతానికిపైగా పెరిగిందని.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 36 శాతానికిపైగా పెరిగిందని రియా సింగ్ పేర్కొన్నారు. రష్యా, మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయన్నారు. స్పాట్ సిల్వర్ 0.56 శాతం పెరిగి ఔన్స్‌కు 41.23 వద్ద ట్రేడవుతున్నది. ప్రపంచ మార్కెట్లలో కామెక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.67 శాతం పెరిగి ఔన్స్‌కు 41.83కి చేరింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,08,380 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ.99,350 పలుకుతున్నది. ఇక కిలో వెండి రూ.1.37లక్షల వద్ద ట్రేడవుతున్నది.