ముంబై, మే 29: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన ధరల కారణంగా బంగారు ఆభరణాల వినిమయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల వినిమయం 9 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గే అవకాశాలున్నాయని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారం ధరలు 33 శాతం పెరగడం ఇందుకు కారణమని తెలిపింది.
2024-25లో కడ్డీల వినిమయం 17 శాతం, నాణేలు 25 శాతం చొప్పున పెరిగాయని పేర్కొంది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో వీటి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్రూపు హెడ్ జితిన్ మక్కర్ తెలిపారు.
ఈ ఏడాది కడ్డీలు, నాణేల డిమాండ్ 10 శాతం మించే అవకాశాలు లేదని ఆయన స్పష్టంచేశారు. రిటైల్ విస్తరణ, అసంఘటిత విభాగం అధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్నదంటున్న ఆయన.. పెరుగుతున్న ధరల కారణంగా వినియోగం తగ్గుతున్నప్పటికీ, పండుగ సీజన్లో డిమాండ్ తగ్గే అవకాశాలు లేవని స్పష్టంచేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాల వినిమయం విలువలో గణనీయమైన 28 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది కూడా ఇదే తరహా పెరుగుదల ఉంటుందని పేర్కొంది.
ప్రస్తుతం కొనసాగుతున్న బంగారం ధరలు ఈ ఏడాది ఇదే స్థాయిలో కొనసాగే అవకాశాలున్నాయని ఇక్రా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయంగా ఏదైనా అనిశ్చిత పరిస్థితులు నెలకొంటే తప్ప ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని తెలిపింది.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయ రాజధాని న్యూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర రూ.500 దిగొచ్చింది. దీంతో పదిగ్రాముల విలువ రూ.99 వేల దిగువకు రూ.98,500కి పడిపోయింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర అంతే స్థాయిలో తగ్గి రూ.98 వేలుగా నమోదైంది. కానీ, వెండి ధరలు యథాతథంగా ఉన్నాయి. కిలో వెండి రూ.1,00,000గా ఉన్నది.