Gold Price | బంగారం ధరలు, వెండి ధరలు ఇటీవలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. యూఎస్ ఫెడల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ కోతలపై చేసిన ప్రసంగం నేపథ్యంలో పసిడి, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దాంతో ధరలు రికార్డు స్థాయి నుంచి దిగివచ్చాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.900 తగ్గి తులానికి రూ.1.18లక్షలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.900 తగ్గి తులం ధర రూ.1,17,400కి పతనమైంది. ఇక వెండి సైతం రూ.600 తగ్గి కిలో రూ.1.39లక్షలకు తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. అయితే, డాలర్ కోలుకోవడం, ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావల్ చేసిన ప్రసంగం నేపథ్యంలో బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి స్వల్పంగా తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ తెలిపారు. స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయని సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.
విదేశీ మార్కెట్లలో స్పాట్ బంగారం ఔన్సుకు స్వల్పంగా 3,760.36 డాలర్లకు పడిపోయింది. మంగళవారం ఔన్సుకు 3,791.11 డాలర్లకు కొత్త గరిష్టాన్ని తాకింది. స్పాట్ వెండి ఔన్సుకు 43.87 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. పసిడి ధరలు రికార్డు గరిష్టానికి చేరడంతో వ్యాపారులు లాభాల స్వీకరణకు ముగ్గుచూపడంతో స్పాట్ గోల్డ్ ధరలు పడిపోయాయి. అయితే, మార్కెట్లు పావెల్ ప్రసంగంలో యూఎస్ ద్రవ్యోల్బణం, ఉపాధి డేటాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ధరలు కోలుకున్నాయి. ప్రస్తుతం ఔన్సుకు 3,760 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయని కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా తెలిపారు. తూర్పు యూరప్, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నుంచి బులియన్ ధరలకు మద్దతు పొందాయని ఆగ్మాంట్లోని పరిశోధనా అధిపతి రెనిషా చైనాని పేర్కొన్నారు. దాంతో సురక్షితమైన డిమాండ్‌ను కొనసాగించిందని.. ధరల పతనాన్ని పరిమితం చేసిందన్నారు. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ.1,15,370 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ.1,05,750 పలుకుతున్నది. ఇక వెండి రూ.1,50,000 వద్ద కొనసాగుతున్నది.