Gold Rate | న్యూఢిల్లీ, జనవరి 16: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. రూ.1.50 లక్షలకు చేరువైన తులం బంగారం ధర అంతే వేగంతో వెనక్కి తగ్గింది. రికార్డు స్థాయికి చేరుకోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేమి కారణంగా పుత్తడి తగ్గుముఖం పట్టింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,100 తగ్గి రూ.1,46,200కి దిగొచ్చింది.
అంతకుముందు ఇది రూ.1,47,300గా నమోదైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు వరుసగా రెండో రోజు తగ్గుముఖం పట్టాయని, మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడం, డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పడిపోయాయి. ఔన్స్ గోల్డ్ ధర 12.46 డాలర్లు తగ్గి 4,603.51 డాలర్లకు పరిమితమవగా, వెండి కూడా 2.26 శాతం తగ్గి 90.33 డాలర్లకు పరిమితమైంది.
వెండి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. మార్కెట్లో వెండి లభ్యత తగ్గిపోయే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా వరుసగా ఆరో రోజు శుక్రవారం కిలో వెండి రూ.2.92 లక్షలు దాటింది. చివరకు బులియన్ మార్కెట్ ముగిసే సమయానికి కిలో వెండి రూ.3,600 ఎగబాకి రూ.2,92,600 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు బలహీనంగా కొనసాగినప్పటికీ పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వీటి ధరలు స్థిరంగా పెరుగుతున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. గత ఆరు సెషన్లలో కిలో వెండి రూ.49,100 లేదా 20 శాతం ఎగబాకింది. ఈ నెల 8న కిలో ధర రూ.2,43,500గా నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వెండి 22.4 శాతం రిటర్నులు పంచింది.
ముంబై, జనవరి 16: రూపాయి మళ్లీ గింగిరాలు కొడుతున్నది. వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన మారకం విలువ శుక్రవారం చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరువైంది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఇతర కరెన్సీలు ఢీలా పడుతున్నాయి. దీంతో దేశీయ కరెన్సీ రూపాయి ఏకంగా 90.78 స్థాయికి పడిపోయింది. శుక్రవారం ఒకేరోజు 44 పైసలు నష్టపోయింది.