హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలోనే దీర్ఘకాలం కొనసాగవచ్చన్న అంచనాలు బలపడటంతో ప్రపంచ మార్కెట్లో పుత్తడి ధర క్రమేపీ పడిపోతున్నది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో 24 క్యారెట్ తులం ధర రూ.280 క్షీణించి రూ.59,450 వద్దకు చేరింది. ఆభరణాల బంగారం (22 క్యారెట్) ధర రూ.250 తగ్గుదలతో రూ.54,500 వద్దకు దిగివచ్చింది.
వెండి కేజీ ధర సైతం రూ.600 తగ్గి రూ.77,000 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,900 డాలర్ల దిగువకు పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరితో డాలర్ విలువ 10 నెలల గరిష్ఠ స్థాయికి పెరిగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ అనలిస్ట్ సౌమిల్ గాంధి తెలిపారు.