హైదరాబాద్, మే 18: బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.870 పెరిగి రూ.74,620 పలికింది. అంతక్రితం ధర రూ.73,750గా ఉన్నది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.800 ఎగబాకి రూ.67,600 నుంచి రూ.68,400 కి చేరుకున్నది.
అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతోపాటు ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలోనే వడ్డీరేట్లు తగ్గించనుండటం, యూఎస్ సూచీ డౌ జోన్స్ తొలిసారిగా 40 వేల మార్క్‌ను అధిగమించడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాం ఉరకలెత్తింది. దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పుంజుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.4 వేలు అధికమై రూ.96,500 పలికింది. అంతకుముందు ఇది రూ.92,500 గా ఉన్నది. గత రెండు రోజుల్లోనే వెండి రూ.8 వేలు పుంజుకున్నది.