న్యూఢిల్లీ, జనవరి 30 : బులియన్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా దేశీయంగా ఆల్‌టైమ్ హై రికార్డులతో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు.. శుక్రవారం భారీగా తగ్గాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు.. ఒక్కరోజే రూ.14,000 (7.65 శాతం) పడిపోయి రూ.1,69,000 (అన్ని పన్నులుతో సహా) వద్ద స్థిరపడింది. గురువారం రూ.12,000 పుంజుకొని మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,83,000 పలికిన విషయం తెలిసిందే. మరోవైపు వెండి ధర కిలో ఏకంగా రూ.20,000 (దాదాపు 5 శాతం) క్షీణించింది. దీంతో రూ.3,84,500 (అన్ని పన్నులుతో సహా) దగ్గర స్థిరపడింది. అంతకుముందు రోజు రూ.19,500 ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.4,04,500ని చేరిన సంగతి విదితమే.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛ త) పుత్తడి తులం ధర రూ.1,55, 100గా ఉన్నది. ఇక కిలో వెండి రేటు రూ.3,95,000 పలికింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్ నుంచి బలహీన సంకేతాలు, అమెరికా డాలర్ తిరిగి బలపడుతుండటంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని, అందుకే డిమాండ్ పడిపోయి గోల్డ్, సిల్వర్ ధరలు క్షీణించాయని మార్కెట్ నిపుణులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 285.30 డాలర్లు దిగి 5,087.73 డాలర్లుగా ఉన్నది. ఒకానొక దశలోనైతే 425.86 డాలర్లు పతనం కావడం గమనార్హం. ఔన్స్ సిల్వర్ ధర కూడా 14 డాలర్లు కోల్పోయి 101.47 డాలర్లుగా నమోదైంది. ట్రేడింగ్ మధ్యలోనైతే 95.26 డాలర్ల స్థాయికి పడిపోయింది.
స్పాట్ మార్కెట్‌తోపాటు ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు బాగా తగ్గిపోయాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 17 శాతం, గోల్డ్ 9 శాతం క్షీణతను చూశాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌పై మార్చి డెలివరీకిగాను వెండి కిలో ధర రూ.3,32,002 పలికింది. క్రితం రోజు ట్రేడింగ్‌తో చూస్తే ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజే రూ.67,891 పడిపోయింది. ఇక ఫిబ్రవరి కాంట్రాక్ట్కుగాను గోల్డ్ 10 గ్రాముల ధర రూ.15,246 క్షీణించి రూ.1,54,157గా నమోదైంది. గురువారం సిల్వర్ రూ.4,20, 048, గోల్డ్ రూ.1,80, 779గా ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయంగా కూడా ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ఆదరణను కోల్పోయాయి. కొమెక్స్లో మార్చి డెలివరీకి ఔన్స్ వెండి 95.12 డాలర్లుగానే ట్రేడైంది. ఏప్రిల్ డెలివరీకి ఔన్స్ గోల్డ్ 4,962.7 డాలర్లుగానే పలికింది. క్రితం రోజు ముగింపుతో చూస్తే.. వరుసగా 19.30 డాలర్లు, 392.10 డాలర్లు నష్టపోయాయి.