Gold Prices | న్యూఢిల్లీ, డిసెంబర్ 25: బంగారం ధగధగ మెరుస్తున్నది. అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహలవైపు మళ్లించడంతో ప్రస్తుతేడాది ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దీంతో గడిచిన ఏడాదికాలంలో బంగారం, వెండి ధరలు 30 శాతం వరకు పెరిగాయి. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుండటం, పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు కారణంగా ఈ ఏడాది ధరలు భారీగా పెరిగాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధరలు దేశవ్యాప్తంగా రూ.76 వేల నుంచి రూ.78 వేల స్థాయిలో ఉన్నాయి. కానీ, వచ్చే ఏడాది తులం పుత్తడి ధర రూ.81 వేల స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. పుత్తడితోపాటు వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో పాటు ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెళ్లు, హెల్త్‌కేర్, ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ వెండి వాడకం భారీగా పెరిగింది. సరఫరా-డిమాండ్ మధ్య వ్యత్యాసం అధికంగా ఉండటం కూడా ధరలు పెరగడానికి కారణమని వారు అంటున్నారు.
ఫెడరల్ రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను క్రమంగా తగ్గించడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి వడ్డీరేట్లను అర శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా కారణమన్నారు. యూఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలవడంతో వ్యాపార అనుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలుతుండటం కూడా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన గోల్డ్‌వైపు మళ్లించారు. గడిచిన రెండు నెలల్లో ఈక్విటీ మార్కెట్లు 11 శాతం వరకు నష్టపోయాయి. అలాగే పలు దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు 500 టన్నులకు పైగా బంగారాన్ని కొనుగోలు చేశాయి.