Gold Rates | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఇటీవల భారీగా పెరిగిన ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ విధాన సమావేశానికి ముందు పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. స్థానిక మార్కెట్లో డిమాండ్ తగ్గిన నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో అమ్మకాలు భారీగా జరిగాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.1000 తగ్గి తులానికి రూ.1,31,600కి చేరుకుంది. వడ్డీ రేట్లపై యూఎస్ ఫెడ్ రిజర్వ్ తీసుకునే నిర్ణయంపై వ్యాపారవర్గాలు వేచిచూసే స్థితిలో ఉన్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. దాంతో మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రత్యక్ష ప్రభావం పడుతున్నది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీలో కమోడిటీస్ అండ్ కరెన్సీ హెడ్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ.. మంగళవారం బంగారం ధరలు తగ్గాయన్నారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ నిర్ణయంపై మార్కెట్ జాగ్రత్తగా ఉందని చెప్పారు.
పెట్టుబడిదారుల దృష్టి అంతా పాలసీ ప్రకటన, ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంపైనే ఉందన్నారు. ఆయన ప్రకటన డాలర్ దిశను నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. బంగారం తరహాలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏకంగా ఒకే సెషనల్లో రూ.4500 తగ్గింది. కిలోకు రూ.1,80,500కి చేరుకుంది. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.35 శాతం పెరిగి 4,205.57 డాలర్లకు చేరుకుంది. విదేశీ మార్కెట్లలో స్పాట్ సిల్వర్ 0.75 శాతం పెరిగి ఔన్సుకు 58.59 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా.. ఫెడ్ రిజర్వ్ సమావేశం మొదలు కాగా.. ఈ సారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు వెండి ధరలకు దన్నుగా నిలుస్తున్నాయని ఆగ్మాంట్లోని పరిశోధనా విభాగం చీఫ్ రినిషా చైనాని తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం రూ.1,29,440 పలుకుతుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,18,650 వద్ద కొనసాగుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.99లక్షలుగా ఉన్నది.