Gold-Silver Price | బంగారం, వెండి ధరలు సామాన్యులకు భారీ ఊరటనిచ్చాయి. ఒకేరోజు భారీగా ధరలు దిగివచ్చాయి. బంగారం రూ.4వేలు, వెండి రూ.8వేల వరకు తగ్గింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేటు కోత అంచనాలు తగ్గడంతో ధరలు పతనమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,900 తగ్గి తులానికి రూ.1,25,800కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ.3,900 తగ్గి తులం రూ.1,25,200కి దిగజారింది. మరో వైపు వెండి ధరలు సైతం భారీగా తగ్గుముఖం పట్టాయి. రూ.7,800 వరకు తగ్గి కిలోకు రూ.1,56,000కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఈ వారం విడుదల కానున్న అమెరికా ఫైనాన్స్ డేటా, ఫెడరల్ రిజర్వ్ పాలసీ సూచనల కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూఎస్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు ఆవిరయ్యాయి.
ఆరువారాలుగా యూఎస్ డేటా లేకపోవడం, ఫెడరల్ రిజర్వ్ అధికారులు చేసిన వ్యాఖ్యలు డిసెంబర్లో వడ్డీ రేటు తగ్గింపు అవకాశాలు తగ్గాయని ఆగ్మాంట్ పరిశోధనా విభాగం చీఫ్ రెనిషా చైనాని పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ వరుసగా నాలుగో సెషన్లో ఔన్సుకు 4,042.32 డాలర్లకు పడిపోయింది. గత నాలుగు సెషన్లలో ఔన్సుకు 4,195.14 గరిష్ట స్థాయి నుంచి 3.64 శాతం పడిపోయింది. వరుసగా మూడురోజుల తగ్గుదతల తర్వాత స్పాట్ సిల్వర్ ధరలు 0.57 శాతం పెరిగి ఔన్సుకు 50.49 డాలర్లకు పెరిగాయి.
రేటు తగ్గింపుపై సందేహాస్పదంగా ఉండడంతో స్పాట బంగారం వరుసగా నాలుగో రోజు పడిపోయిందని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. డిసెంబర్లో రేటు తగ్గింపు అంచనాలు ఈ నెల 5న 63శాతం ఉండగా.. ప్రస్తుతం 41శాతానికి తగ్గింది. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లో సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ మాట్లాడుతూ సెప్టెంబర్ ఉపాధి నివేదికను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తాయని.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారం, ఫలితాలు వడ్డీ రేటు అంచనాలపై మరింత స్పష్టతను ఇస్తాయని సమీప భవిష్యత్తులో బంగారం ధరలపై ప్రభావం చూపవచ్చని అన్నారు.