న్యూఢిల్లీ, జనవరి 2: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 4,000 పుంజుకొని మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,41, 400 పలికింది. మరోవైపు 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం విలువ కూడా రూ.1,100 ఎగిసి రూ.1,39, 440గా నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. 24 క్యారెట్ తులం పుత్తడి రేటు రూ.1,140 ఎగబాకి రూ.1,36, 200గా ఉన్నది.
22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,050 పెరిగి రూ.1,24, 850గా ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 67.47 డాలర్లు అందిపుచ్చుకొని 4,392. 94 డాలర్లకు చేరింది. సిల్వర్ ఔన్స్ 74.52 డాలర్లుగా ఉన్నది. కాగా, సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమ నుంచి డిమాండ్ వల్ల వెండి ధరలు దేశీయంగా ఈ స్థాయిలో పెరుగుతూపోతున్నాయని మార్కె ట్ నిపుణులు అంటున్నారు. గత ఏడాది కిలో ధర ఏకంగా రూ.1,49,300 పెరిగిన విషయం తెలిసిందే. తులం బంగారం రూ.58,750 పెరిగింది.