న్యూఢిల్లీ, డిసెంబర్ 11: బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఆభరణాల వర్తకులు, స్టాకిస్ట్లు అత్యధికంగా కొనుగోళ్లు జరుపుతుండటంతో బంగారం మళ్లీ 80 వేల పైకి చేరుకున్నదని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.620 ఎగబాకి మూడు వారాల గరిష్ఠ స్థాయి రూ.80,400 పలికింది. అంతకుముందు ఇది రూ.79, 780గా ఉన్నది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 80 వేలకు చేరుకున్నది. బంగారంతోపాటు వెండి పరుగులు పెట్టింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.1,450 పెరిగి నెల గరిష్ఠ స్థాయి రూ.96,300కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,700 డాలర్లకు చేరుకోవడం వల్లనే దేశీయంగా ధరలు పెరుగుతున్నాయని వర్తకులు వెల్లడించారు.