Gold Sales | రెండేండ్ల తర్వాత కర్వా చౌత్ వేడుక అరుదైన రికార్డు నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే రూ. 3,000 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఇది 36 శాతం ఎక్కువ. కొవిడ్-19 కారణంగా రెండేండ్లుగా బులియన్ బిజినెస్ అకస్మికంగా పడిపోయిందని వ్యాపారుల సంఘం.. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్), అఖిల భారత జ్యువెల్లర్స్, గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) గురువారం సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఏడాది (2021) క్రితం సుమారు రూ.2,200 కోట్ల బంగారం ఆభరణాలు అమ్ముడయ్యాయని కెయిట్, ఏఐజేజీఎఫ్ పేర్కొన్నాయి. ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.52 వేలు, 22 క్యారట్ల బంగారం తులం రూ.48 వేలు పలికింది. కిలో వెండి ధర రూ.59 వేలకు చేరుకుందని కెయిట్, ఏఐజేజీఎఫ్ తెలిపాయి.
‘వ్యాపార పరంగా బంగారం, వెండి వ్యాపారులకు అక్టోబర్, నవంబర్ నెలలు చాలా పవిత్రమైన సమయం. కర్వా చౌత్ తర్వాత పుష్య నక్షత్ర, దంతేరాస్, లక్ష్మీ పూజ, దీపావళి, భైయా దూజ్, ఛాత్ పూజ, తులసి వివాహం అంగరంగ వైభవంగా, అట్టహాసంగా జరుపుతారు’ అని కెయిట్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్, ఏఐజేజీఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ అరోరా తెలిపారు. జన సామాన్యం భారీ మొత్తంలో లైట్ వెయిట్ జ్యువెలరీ కొనుగోలు చేశారని, ఫ్యాషన్ జ్యువెలరీ, ట్రెడిషనల్ జ్యువెలరీ, సిల్వర్ ఆభరణాలు భారీగా స్థాయిలోనే కొన్నారని ప్రవీణ్ ఖండేల్వాల్, పంకజ్ అరోరా చెప్పారు.
బంగారం దిగుమతిపై సుంకం 7.5 శాతం నుం 12.5 శాతానికి పెంచివేసింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల బంగారం జ్యువెల్లరీ రెవెన్యూ గ్రోత్ ఫ్లాట్‌గా ఉంటుందని క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది . పెంచిన దిగుమతి సుంకాన్ని వ్యాపారులు కస్టమర్లపై మోపుతారని పేర్కొంది. తత్ఫలితంగా కస్టమర్లు విచక్షణాయుతంగా బంగారం కొనుగోళ్లు జరుపుతారని పేర్కొంది.