2016 నుంచి బంగారం ధర బుల్లిష్ ట్రెండ్‌లోనే ఉంటున్నది. అయినప్పటికీ చాలామంది ఆర్థిక నిపుణులు పుత్తడిపై పెట్టుబడిని సరైన నిర్ణయంగా అంగీకరించలేకపోయారు. కానీ ఇప్పుడు వారందరి అభిప్రాయాలు మారుతున్నాయి. పోర్ట్‌ఫోలియోల్లో బంగారానికి కూడా ప్రధాన పాత్ర ఉందని ఒప్పుకుంటున్నారు. నిజానికి పసిడి అంటే.. భారతీయుల్లో నగలు, నాణేలే. అది విలువైన సంప్రదాయ ఆస్తి. తర్వాత తరాలకు ఇవ్వడం గౌరవం, ఓ ఆనవాయితీ. అయితే గత కొన్నేండ్లుగా ఈ భావన మారింది. గోల్డ్‌ను ఆర్థిక సాధనంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)కు ఆదరణ పెద్ద ఎత్తున పెరుగుతున్నది.
– అలోక్ జైన్, వీకెండ్ ఇన్వెస్టింగ్ వ్యవస్థాపకులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఒకప్పుడు కేవలం విలువైన అలంకరణ వస్తువుగానే ఉన్న బంగారం, వెండి.. ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా తయారయ్యాయి. ముఖ్యంగా గత ఐదేండ్లలో కమోడిటీ మార్కెట్ రూపురేఖలే మారిపోయాయి. పెట్టుబడి సాధనాలను ఎంచుకొనే మదుపరుల ఆలోచనా సరళిలోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది మరి. అందుకే నేడు గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు గొప్ప గిరాకీనే అందుకుంటున్నాయి.
ఇదీ సంగతి..
పెట్టుబడులపరంగా ఈ ఏడాది నిజంగా గోల్డెన్ ఇయరే. దేశీయ మార్కెట్లో ప్రస్తుత సంవత్సరం బంగారం ధర దాదాపు డబులైతే.. వెండి రేటు రెట్టింపునకుపైగా పుంజుకున్నది. నిరుడు డిసెంబర్ 31న 24 క్యారెట్ 10 గ్రాముల పుత్తడి విలువ రూ.78,950 వద్ద ముగిసింది. శుక్రవారం ఇది రూ.1,36,515 వద్ద స్థిరపడింది. దీంతో రూ.57,565 పెరిగినైట్టెంది. అలాగే కిలో వెండి నాడు రూ.89, 700 వద్ద ఉంటే.. నేడు రూ.2,04,100గా ఉన్నది. రూ.1,14,400 పెరిగింది.
నిజానికి ఈ నెల 15న తులం బంగారం మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,37,600 పలికింది. 18న కిలో వెండి రూ.2,07,600గా నమోదైంది. 2023 ముగింపుతో పోల్చితే 2024లో పసిడి ధర కేవలం రూ.15,030 పెరిగింది. కానీ ఏడాది వ్యవధిలో దాదాపు 4 రెట్లు ఎగబాకింది. దశాబ్దాల చరిత్ర చూసినా ధరల్లో ఈ స్థాయి పెరుగదల మాత్రం ఎప్పుడూ లేదు. దీనికి సంప్రదాయ కారణాలకంటే ఇతర అంశాలే ఎక్కువ కారణంగా నిలిచాయి. స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత స్థితి, ఆయా దేశాల మధ్య ఉద్రిక్తతలు, అమెరికా సుంకాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాదీ ఈ ప్రభావం కొనసాగవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో 2026లో బంగారం, వెండి ధరలు ఇంకెంత? పెరుగుతాయోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఈటీఎఫ్‌లు ఆకర్షణీయం
గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లు మార్కెట్లో ఇన్వెస్టర్లకు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయిప్పుడు. డీమ్యాట్ ఖాతాల ద్వారా క్రయవిక్రయాలకు ఈటీఎఫ్‌లు వీలు కల్పిస్తాయి. వీటిపై నియంత్రణ కూడా ఉంటుంది. అయితే దీర్ఘకాల మదుపరులు నిపుణుల సలహాతో ముందుకెళ్తే.. మరింత లాభిస్తుంది. సంప్రదాయ బంగారం, వెండితో పోల్చితే ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు ఎంతో సురక్షితంగా చెప్పవచ్చు. పైగా నిల్వ చేయాల్సిన అవసరం, దొంగతనం భయాలు ఉండవు. అయితే ఇన్వెస్టర్లకు చార్జీల భారం ఉంటుంది.