Gold Price | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. రూపాయి బలపడడంతో పుత్తడి ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.500 తగ్గి తులానికి రూ.98,520కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గి తులానికి రూ.97,800కి పనతమైందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. బంగారం బాటలోనే వెండి ధర సైతం భారీగానే పతనమైంది. రూ.2వేలు తగ్గి కిలోకు రూ.1.12లక్షలకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25శాతం సుంకాలు విధించిన ప్రపంచ మార్కెట్లో రూపాయి బలపడడం విశేషం. డాలర్‌తో పోలిస్తే 22 పైసలు బలపడి 87.58 వద్ద ముగిసింది. ఆగస్టు 1 గడువుకు ముందు వాణిజ్య ఒప్పందం కుదరకపోతే భారత వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా ప్రకటించిన తర్వాత బుధవారం రూపాయి 87.80 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.
హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు (కమోడిటీస్) సౌమిల్ గాంధీ బంగారం ధరలు తగ్గాయని తెలిపారు. సానుకూల యూఎస్ స్థూల ఆర్థిక డేటా కారణంగా డాలర్ బలపడడంతో బులియన్ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచిందన్నారు. తాజా జీడీపీ డేటా రెండో త్రైమాసికంలో యూఎస్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందని సూచిస్తుందని తెలిపారు. ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది మాట్లాడుతూ బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయన్నారు. సుంకాల ఆందోళనల మధ్య సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లను తగ్గిస్తామని ఫెడ్ రిజర్వ్ ఎలాంటి సూచనలు ఇవ్వలేదన్నారు. ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ బంగారం 0.89 శాతం పెరిగి ఔన్సుకు 3,304.14 డాలర్లకు చేరాయి. విదేశీ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 2.22 శాతం తగ్గి 36.30కి చేరుకుంది. పెట్టుబడిదారులు ద్రవ్య విధానం, వ్యక్తిగత వినియోగ వ్యయం (PCE) సూచిక, నిరుద్యోగ డేటా, యూఎస్ స్థూల ఆర్థిక డేటాను నిశితంగా పరిశీలిస్తారని కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా చెప్పారు.