న్యూఢిల్లీ, జనవరి 27: బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. మంగళవారం అటు పుత్తడి, ఇటు వెండి రేట్లు మళ్లీ ఆల్‌టైమ్ హై గరిష్ఠాలను తాకాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పసిడి విలువ ఒక్కరోజే రూ.7,300 (4.60 శాతం) ఎగిసింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,66,000 పలికింది. మరోవైపు కిలో వెండి ధర ఏకంగా రూ.40,500 (12.30 శాతం) ఎగబాకడం గమనార్హం. ఫలితంగా రూ.3,70,000 వద్ద ముగిసింది.
హైదరాబాద్‌లోనూ పసిడి, వెండి ధరలు పరుగులు పెట్టాయి. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం బంగారం రూ.1,48, 450గా నమోదైంది. కిలో వెండి రూ.3,70, 000గా ఉన్నది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 5,087.48 డాలర్లు పలికింది. క్రితంతో పోల్చితే 79.13 డాలర్లు పెరిగింది. ఔన్స్ వెండి రేటు 117.73 డాలర్లుగా ఉన్నది. గతంతో చూస్తే 14.42 డాలర్లు పుంజుకున్నది. అయితే పెరుగుతున్న ధరలతో వ్యాపారం అంతంతమాత్రంగానే సాగుతున్నదని నగల వర్తకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప కొనడానికి ముందుకు రావట్లేదని అంటున్నారు.
స్పాట్ మార్కెట్‌కు తగ్గట్టుగానే ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు విజృంభిస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ పై మార్చి డెలివరీకిగాను సిల్వర్ కేజీ ధర రికార్డు స్థాయిలో రూ.3,59, 800గా నమోదైంది. ఈ ఒక్కరోజే రూ.25, 101 పెరిగింది. బంగారం విషయానికొస్తే.. ఫిబ్రవరి కాంట్రాక్ట్స్‌లో రూ.3,783 పుంజుకొని 24 క్యారెట్ తులం రూ.1,59,820 పలికింది.
వారం రోజుల్లోనే రూ.13,520 ఎగిసినట్టు ట్రేడర్లు చెప్తున్నారు. కాగా, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన ఆందోళనల నడుమ మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం గోల్డ్, సిల్వర్ వైపు చూస్తున్నారని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. స్టాక్ మార్కెట్ల నష్టాలు.. ఇన్వెస్టర్లను కమోడిటీ మార్కెట్ల దిశగానే వెళ్లేలా చేస్తున్నాయంటూ ప్రస్తుత ట్రెండ్‌ను విశ్లేషిస్తున్నారు. మరికొద్ది రోజులు ధరలు పెరుగుతూనే ఉంటాయన్న అంచనాలను వెలిబుచ్చుతుండటం గమనార్హం.