Go-First | ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని గత మే నెలలో నేలకు పరిమితమైన ఎయిర్ లైన్స్.. గో-ఫస్ట్ (Go First) త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనున్నది. ఇందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదం లభించింది. అయితే, కొన్ని షరతులను గో-ఫస్ట్ యాజమాన్యం పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
తన ఎయిర్ బస్ ఏ320 నియో విమానాల్లో వినియోగిస్తున్న ప్రాట్-విట్నీ ఇంజిన్ల మార్పిడిలో సమస్యలు ఉన్నాయనే పేరిట గత మే నెల ప్రారంభంలో గో-ఫస్ట్.. స్వచ్ఛంద దివాళా పరిష్కారం కోసం పిటిషన్ దాఖలు చేసింది. కానీ గో-ఫస్ట్ ఆరోపణలను ప్రాట్-విట్నీ సంస్థ కొట్టి పారేసింది. గో-ఫస్ట్ వాదనలో పసలేదని తేల్చేసింది.
ఇదిలా ఉంటే, గో-ఫస్ట్ దాఖలు చేసిన స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ).. గో-ఫస్ట్ నుంచి రుణాలు, బకాయిల వసూళ్లపై గత మే 10న మారటోరియం విధించింది. సమస్య పరిష్కారానికి ఇంటరిం రిజొల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ) ని నియమించింది. జూన్ 9న కమిటీ ఆఫ్ క్రెడిటర్ల తరఫున (సీఓసీ)గా శైలేంద్ర అజ్మీరాను నియమించింది.
గత నెల 28న విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రణాళికను డీజీసీఏకు రిజొల్యూషన్ ప్రొఫెషనల్ సమర్పించారు. ముంబై, ఢిల్లీల్లోని గో-ఫస్ట్ వసతులపై ఈ నెల నాలుగో తేదీ నుంచి ఆరో తేదీ వరకు స్పెషల్ అడిటింగ్ నిర్వహించారు. సేఫ్టీ, నిబంధనలకు అనుగుణంగా వసతులు ఉన్నాయా? అన్న విషయమై సర్వేలో ఫోకస్ చేశారు. గో-ఫస్ట్ వసతులపై అడిటింగ్ నివేదికను డీజీసీఏ ఆమోదించింది.
ఈ నెల 15న గోఫస్ట్ తన విమాన సర్వీసుల పునరుద్ధరణ ప్రణాళికను సవరించింది. 15 విమానాలతో ప్రతి రోజూ 114 విమాన సర్వీసులు నడుపుతామని తెలిపింది. ఈ సవరణ ప్రతిపాదనను ఆమోదించిన డీజీసీఏ.. గోఫస్ట్ దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీలోని హైకోర్టు, ఎన్సీఎల్టీ బెంచ్‌ల తీర్పుననుసరించి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.