Go First | నిధుల కొరతతో నేలకు పరిమితమైన దేశీయ విమానయాన సంస్థ ‘గోఫస్ట్ (Go First) పునరుద్ధరణకు బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఇందుకోసం తాత్కాలికంగా రూ.425 కోట్ల రుణాలిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చాయి. ఆయా బ్యాంకుల బోర్డులు సైతం ఆమోదం తెలపాల్సి ఉంది. ‘గోఫస్ట్’కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాయిష్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లతో కూడిన కన్సార్టియం రుణాలు మంజూరు చేస్తుంది.
ఆయా బ్యాంకుల బోర్డులు ఆమోదం తెలిపిన తర్వాత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ఆమోదం లభించిన తర్వాత గోఫస్ట్ విమానాల సర్వీసులు పున:ప్రారంభం కానున్నాయి. డీజీసీఏ ఆమోదం లభిస్తే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించాలని గోఫస్ట్ భావిస్తున్నది. తొలి దశలో 22 విమానాలతో ప్రతి రోజూ 150 సర్వీసుల నిర్వహణకు గోఫస్ట్ సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. కార్యకలాపాల పున: ప్రారంభానికి, టికెట్ల విక్రయానికి డీజీసీఏ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.
గత నెల రెండో తేదీ నుంచి గోఫస్ట్ విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్న గోఫస్ట్.. స్వచ్ఛంద దివాళా పరిష్కార ప్రక్రియ కోసం పిటిషన్ దాఖలు చేసింది.ఈ నేపథ్యంలో బ్యాంకర్ల ఆధ్వర్యంలోని రుణదాతల కమిటీకి గోఫస్ట్ పరిష్కార ప్రొఫెషనల్ శైలేంద్ర అజ్మీరా.. బ్యాంకర్ల ముందు పరిష్కారం కోసం ప్లాన్ ప్రతిపాదించారు. రూ.425 కోట్ల మేరకు నిధులు సమకూర్చాలని బ్యాంకర్లను కోరారు. గోఫస్ట్’కు బ్యాంకులు రూ.6,500 కోట్ల పై చిలుకు రుణాలు ఇచ్చాయి.