న్యూఢిల్లీ, జనవరి 6: అదానీ బాండ్లకు యమక్రేజీ నెలకొన్నది. అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(ఏఈఎల్) జారీ చేసిన రూ.1,000 కోట్ల నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్సీడీ) ప్రారంభించిన కేవలం 45 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం అందించింది. దీంట్లో రూ.500 కోట్ల ఎన్సీడీలు కేవలం పది నిమిషాల్లో అమ్ముడు పోగా..మిగతా రూ.500 కోట్ల బాండ్లు మరో అరగంటలో విక్రయించింది.
ఈ బాండ్ల జారీ మంగళవారం ప్రారంభం కాగా, ఈ నెల 19న ముగియనున్నాయి. కానీ, ప్రారంభించిన రోజే పూర్తిగా అమ్ముడు పోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత అనే ప్రాతిపదికన కేటాయింపు జరుగుతుందని తెలిపింది.
ఈ బాండ్లపై 8.90 శాతం వరకు వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఈ ఎన్సీడీలను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ చేయనున్నది సంస్థ. ఈ బాండ్లపై ఇక్రా, కేర్ రేటింగ్ ఏజెన్సీలు ‘ఏఏ-’ రేటింగ్ ఇచ్చాయి. 24 నెలలు, 36 నెలలు, 60 నెలల కాలపరిమితితో జారీ చేసిన ఎస్సీడీలపై వడ్డీని త్రైమాసికం, ఏడాదికొక సారి చెల్లింపులు జరుపనున్నది. జూలై 2025లో సంస్థ రూ.1,000 కోట్ల ఎన్సీడీలను జారీ చేసి సేకరించింది.