న్యూఢిల్లీ, జనవరి 6: బంగారం పరుగు పందెం ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్న పుత్తడి మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర మరో రూ.1,100 ఎగబాకి రూ.1,41, 500కి చేరుకున్నది. గడిచిన నాలుగు రోజుల్లో ఏకంగా రూ.3 వేల పైగా ఎగబాకినట్టు అయింది. వెండి మంగళవారం రూ.2.50 లక్షల కీలక మైలురాయిని అధిగమించింది.
కిలో వెండి రూ.7 వేలు ఎగబాకి రూ.2.51 లక్షలకు చేరుకున్నది. అంతర్జాతీయంగా అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడం వల్లనే దేశీయంగా ధరలు దూసుకుపోతున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
అలాగే ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకుంటున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 11.45 డాలర్లు అందుకొని 4,461 డాలర్లకు చేరుకోగా, వెండి 78.36 డాలర్లకు చేరుకున్నది.