న్యూఢిల్లీ, ఆగస్టు 14: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో వచ్చిన మార్పులు, ఫారెక్స్ మార్కెట్లో కరెన్సీ తీవ్ర ఆటుపోటులకు గురికావడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్, సీఈవో విక్రమ్ పవాహ్ తెలిపారు.
ప్రస్తుతం సంస్థ రూ.46.9 లక్షలు మొదలుకొని రూ.2.6 కోట్ల లోపు ధర కలిగిన మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. ప్రస్తుత పండుగ సీజన్లో మరిన్ని నూతన మాడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.