హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): జర్మనీకి చెందిన డ్యూషే బోర్స్ సంస్థ.. హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా డ్యూషే బోర్స్ సీఈవో, సీవోవో అమిత దేశాయ్ మాట్లాడుతూ..అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా నేడు ఇక్కడ జీసీసీని ప్రారంభించినట్టు, తద్వార వచ్చే రెండేండ్లలో వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయన్నారు. అనంతరం జర్మనీ కాన్సుల్ జనరల్‌కు చెందిన ఓ ప్రతినిధి బృందం..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, నగరాన్ని ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని జర్మనీ బృందానికి సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించడానికి ప్రత్యేకంగా టీచర్ల నియామకానికి జర్మనీ కాన్సుల్ జనరల్‌ను సీఎం కోరారు. మరోవైపు, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు చెందిన ప్రతినిధి బృందం మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైంది. తెలంగాణలో ఏడబ్ల్యూఎస్ చేపట్టిన వివిధ డాటా ప్రాజెక్టులు, కంపెనీ విస్తరణ అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ(ఫిన్ టెక్)కి అత్యంత కీలకమైన గ్లోబల్ కమాండ్ సెంటర్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. రాయదుర్గంలో అంతర్జాతీయ దిగ్గజ ఫైనాన్షియల్ మారెట్ సంస్థ డ్యూషే బోర్స్ గ్రూప్ జీసీసీను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పిల్లర్‌గా ఉన్న డ్యూషే బోర్స్ గ్రూప్ హైదరాబాద్‌ను ఎంచుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పటిష్ఠమైన పాలసీలు, స్థిరత్వం, ఇకడి టాలెంట్ పూల్‌పై గ్లోబల్ కంపెనీలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు.
మరోవైపు, ద్వైపాక్షిక సహకారం ద్వారా నైపుణ్యాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ఉమ్మడి పురోగతి వైపు కలిసి అడుగేద్దామని దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్యూబా ప్రతినిధులను ఆహ్వానించారు. ‘తెలంగాణ – క్యూబా’ మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగులేరా, ఫస్ట్ సెక్రటరీ మికీ డియాజ్ పెరెజ్ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు.