GDP Growth | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) లో భారత్ వృద్ధిరేటు తగ్గుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనా వేసిన వృద్ధిరేటు కంటే తగ్గి 7.1 శాతానికి పరిమితం అవుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం వృద్ధిరేటు 7.8 శాతం వద్ద నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో మరింత తగ్గుముఖం పట్టింది. సార్వత్రిక ఎన్నికలు, ఉత్పాదకతలో సానుకూల ధొరణుల నేపథ్యంలో జూన్ జీడీపీ వృద్ధిరేటు తగ్గి ఉండొచ్చునని అంచనా వేశారు.
41 ప్రధాన ఇండికేటర్ల ఆధారంగా భారత్ వృద్ధిరేటు తగ్గుముఖం పట్టి ఉండొచ్చునని భావిస్తున్నట్లు ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. వస్తువుల విక్రయాల్లో మోస్తరు వృద్ధిరేటు, మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో సిబ్బంది ఖర్చులు పెరుగుదల వంటి అంశాల ఆధారంగా జీడీపీని ఖరారు చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణంలో సానుకూలతలతో వడ్డీరేట్లు తగ్గించేందుకు అవకాశం ఉందని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు తెలిపారు. వివిధ కంపెనీల నికర లాభాలు తగ్గుతాయని, ఉత్పాదకత పడిపోతుందని పేర్కొన్నారు.
బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు మినహా కార్పొరేట్ కంపెనీల ఆదాయం కేవలం ఐదు శాతం పెరుగుతుందని, నిర్వహణ లాభాలు ఒకశాతం తగ్గుతుందని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు 7.5 శాతం ఉంటుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనాకు వచ్చారు. ఆర్బీఐ అంచనా వృద్ధిరేటు 7.2 శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.