న్యూఢిల్లీ, మే 19: దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో 6.9 శాతంగా నమోదు కావచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం అంచనా వేసింది. ఈ క్రమంలోనే మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2024-25) 6.3 శాతంగా ఉండొచ్చన్నది. అయితే జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) అంచనా కంటే ఇది తక్కువగా ఉండటం గమనార్హం. 2024-25కుగాను 6.5 శాతం జీడీపీ నమోదు కావచ్చని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్ఎస్వో అంచనా వేసిన విషయం తెలిసిందే.
అయితే ఏప్రిల్-జూన్లో 6.5 శాతంగా, జూలై-సెప్టెంబర్లో 5.6 శాతంగా, అక్టోబర్-డిసెంబర్లో 6.2 శాతంగా జీడీపీ గణాంకాలున్నాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరానికిగాను ఎన్ఎస్వో అంచనా నిజం కావాలంటే.. ఈ జనవరి-మార్చిలో 7.6 శాతంగా జీడీపీ నమోదు కావాల్సిందే. కానీ ఇక్రా అంచనా 6.9 శాతంగానే ఉన్నది. ఈ క్రమంలోనే 2024-25లో దేశ జీడీపీని 6.3 శాతానికే పరిమితం చేసింది. కాగా, ఈ నెల 30న జనవరి-మార్చి త్రైమాసికంతోపాటు 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను జీడీపీ గణాంకాలను ఎన్ఎస్వో విడుదల చేయనున్నది. 2023-24లో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.2 శాతంగా ఉన్న సంగతి విదితమే.