న్యూఢిల్లీ, ఆగస్టు 29: హిండెన్‌బర్గ్ దెబ్బకు లక్షల కోట్ల సంపదను కోల్పోయిన గౌతమ్ అదానీ మళ్లీ దేశీయ కుబేరుడిగా అవతరించారు. ప్రస్తుత సంవత్సరానికిగాను తన సంపద 95 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లతో దేశీయ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ స్థానంలో కొనసాగిన ముకేశ్ అంబానీ రెండో సానానికి పడిపోయినట్టు 2024 సంవత్సరానికిగాను హురూన్ ఇండియా విడుదల చేసిన సంపన్నవర్గాల జాబితాలో పేర్కొంది. గతేడాదికాలంలో ముకేశ్ అంబానీ సంపద 25 శాతం పెరిగి రూ.10.14 లక్షల కోట్లుగా నమోదైంది. 2023లో గౌతమ్ అదానీ సంపద 57 శాతం కరిగిపోయి రూ.4.74 లక్షల కోట్లకు పరిమితంకాగా, ఇదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద రూ.8.08 లక్షల కోట్లకు ఎగబాకింది. ఆ తర్వాతి స్థానాల్లో రూ.3.14 లక్షల కోట్లతో హెచ్‌సీఎల్ ఫౌండర్ శివ్ నాడర్ మూడో స్థానంలో నిలువగా, రూ.2.89 లక్షల కోట్లతో సైరస్ పూనావాల నిలిచారు. రూ.2.50 లక్షల కోట్ల సంపదతో దిలీప్ సంఘ్వీ ఐదో స్థానం వరించింది. భారత్‌లో బిలియనీర్ల సంఖ్య నానాటికి పెరుగుతున్నదని తెలిపింది. గతేడాది భారత్‌లో ప్రతి 5 రోజులకొక బిలయనీరు తయారైనట్లు నివేదిక వెల్లడించింది.
మూడో స్థానంలో హైదరాబాద్
హైదరాబాద్ మరో ఘనతను సాధించింది. నగరాల వారీగా శ్రీమంతులు జాబితాలో తొలిసారిగా బెంగళూరును అధిగమించి హైదరాబాద్ మూడో స్థానం దక్కించుకున్నది. నగరం నుంచి 104 మంది కుబేరులు ఉన్నట్లు హురూన్ విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది. 386 మందితో ముంబై ఎప్పటిలాగే తొలి స్థానంలో నిలువగా, 217 మందితో న్యూఢిల్లీ ఆ తర్వాతి స్థానం వరించింది. హైదరాబాద్‌లో కొత్తగా ఈ ఏడాది 17 మంది శ్రీమంతుల జాబితాలో చేరినట్లు పేర్కొంది. అలాగే బిలియనీర్లు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.