ముంబై, జూన్ 17: దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల పరంపర కొనసాగుతున్నది. వరుసగా నాలుగో రోజు బుధవారం కూడా సూచీలు ఒక్క శాతం వరకు బలపడ్డాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతిచర్చలు కొలిక్కి రావడంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఇంట్రాడేలో 400 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 347.14 పాయింట్లు లాభపడి 77,155.62 వద్ద ముగిసింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 96.55 పాయింట్లు ఎగబాకి 24,085.70 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల దిగువకు పడిపోవడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపర్లలో సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ మరోసారి 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమించింది. గత నాలుగు రోజుల్లో మదుపర్లు సంపద రూ.22.78 లక్షల కోట్లు పెరిగి ఈ కీలక మైలురాయిని అధిగమించడానికి దోహదం చేసింది. వరుసగా నాలుగు రోజులుగా సూచీలు కదంతొక్కడంతో మదుపర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతిచర్చలు కొలిక్కి రావడంతో గత నాలుగు రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 3,323.07 పాయింట్లు లేదా 4.50 శాతం, నిఫ్టీ 924 పాయింట్లు 3.98 శాతం ఎగబాకింది. దీంతో గత నాలుగు సెషన్లలో మదుపర్ల సంపద రూ.22.78 లక్షల కోట్లు పెరిగి రూ.4,75,12,374.27 కోట్ల(5.03 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది.