Paytm | ముంబై, ఫిబ్రవరి 8: ఎన్నిసార్లు హెచ్చరించినా రెగ్యులేటరీ మార్గదర్శకాలను పేటీఎం అనుసరించలేదని, దాని నిర్లక్ష్యం వల్లే కఠిన చర్యలకు దిగాల్సి వచ్చిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. అంతేగానీ వ్యవస్థీకృత ఆందోళనలేమీ లేవని ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడించారు.
ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లోని ఖాతాలు, ప్రీ-పెయిడ్ సాధనాలు, ఈ-వ్యాలెట్లలో కస్టమర్లు డిపాజిట్లను చేయరాదని, బ్యాంక్ కూడా వాటిని అంగీకరించరాదని జనవరి 31న ఆర్బీఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపైనా బ్యాంక్‌పై ఆంక్షలుండగా, తాజా పరిమితులతో దాదాపుగా సంస్థ సేవలు నిలిచిపోయినట్టే అవుతున్నది. అయితే ఈ గడువును పొడిగించాలని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మ విజ్ఞప్తి చేయగా, ఈ విషయం ఆర్బీఐతోనే తేల్చుకోవాలని మంత్రి సూచించినట్టు సమాచారం.