న్యూఢిల్లీ, ఆగస్టు 20 : త్వరలో వ్యక్తిగత జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు దక్కనున్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ర్టాలు జై కొడుతున్నట్టు బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య, జీవిత బీమాలపై ఏర్పాటైన రాష్ట్ర మంత్రుల బృందం (జీవోఎం) కన్వీనర్ సామ్రాట్ చౌధరి తెలిపారు. తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ర్టాల మంత్రులు సభ్యులుగా ఉన్న ఈ జీవోఎం బుధవారం ఇక్కడ సమావేశమైంది. ఈ సందర్భంగానే సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన పలు అంశాలపై స్పష్టత ఇచ్చారు. కాగా, ప్రస్తుతం ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో వచ్చే నెలలో జరుగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.
‘ఈ ప్రతిపాదనకు దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాలు మద్దతు పలికాయి. అయితే జీఎస్టీ మినహాయింపు ప్రయోజనం.. కంపెనీలకుగాక, కస్టమర్లకే అందాలని, అందుకోసం ఓ యంత్రాంగాన్ని తేవాలని కోరాయి’ అని జీవోఎంలో సభ్యత్వం ఉన్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయితే జీఎస్టీ కౌన్సిల్ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కాగా, వ్యక్తిగత బీమా పాలసీలకు జీఎస్టీ మినహాయింపుతో ఏటా దాదాపు రూ.9,700 కోట్ల ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా ప్రీమియంలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.8,262.94 కోట్ల జీఎస్టీని వసూలు చేశాయి. అలాగే హెల్త్ రీఇన్సూరెన్స్ ప్రీమియంలపై రూ.1,484.36 కోట్లు వసూలు చేశాయి. ఇక జీఎస్టీ మండలికి జీవోఎం తమ నివేదికను ఈ ఏడాది అక్టోబర్ ఆఖరుకల్లా అందించాల్సి ఉన్నది. ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆందోళనల్నీ ఈ నివేదికలో పొందుపర్చినట్టు సామ్రాట్ చౌధరి తెలిపారు. ఇదిలావుంటే పంద్రాగస్టు రోజున కేంద్రం ప్రకటించిన తర్వాతి తరం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగానే ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై జీఎస్టీ ఎత్తివేత ప్రతిపాదన అని చెప్తున్నారు. ఇప్పటికే జీఎస్టీ స్లాబులను 4 నుంచి 2కు తగ్గించాలని కేంద్రం ప్రతిపాదించిన సంగతి విదితమే. ప్రస్తుతమున్న 5, 12, 18, 28 శాతం స్లాబుల్లో 12 శాతం స్లాబులోని 99 శాతం వస్తూత్పత్తులను 5 శాతం స్లాబులోకి, 28 శాతం స్లాబులోని 90 శాతం వస్తూత్పత్తులను 18 శాతం స్లాబులోకి మార్చి ఆయా (12, 28) స్లాబులను తొలగించాలని చూస్తున్నారు. మిగిలేవి 5 శాతం, 18 శాతం స్లాబులే. మెరిట్, స్టాండర్డ్ ఆధారంగా వస్తూత్పత్తులను వర్గీకరించబోతున్నారు. పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్లు, బైకులు తదితరాలపై 40 శాతం జీఎస్టీ ఉంటుంది. వీటన్నిటిపై చర్చించేందుకే తాజా జీవోఎం భేటీ జరిగింది.
జీఎస్టీ విధానంలో తమ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న సంస్కరణల్ని జీవోఎంకు ఆర్థిక మంత్రి నిర్మల తాజా సమావేశంలో వివరించారు. ఈ అంశంపై రాష్ర్టాలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఇదిలావుంటే నష్టపరిహార సెస్సుపైనా జీవోఎం ప్రధానంగా దృష్టి పెట్టింది. కేంద్ర, రాష్ర్టాల పన్నులను కలిపి 2017 జూలై 1న దేశవ్యాప్తంగా జీఎస్టీని అమల్లోకి తెచ్చినది తెలిసిందే. అయితే జీఎస్టీతో రాష్ర్టాలకు వాటిల్లుతున్న రెవిన్యూ నష్టాల భర్తీకి నష్టపరిహార సెస్సును విధించారు. తొలుత ఐదేండ్లనుకున్నా కరోనాతో మారిన పరిస్థితుల దృష్ట్యా వచ్చే మార్చి 31దాకా పొడిగించారు. కరోనాతో జీఎస్టీ ఆదాయం పడిపోయిందని, అయినప్పటికీ రాష్ర్టాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉన్నందున.. అప్పులు చేసి కడుతున్నామని, వాటిని తీర్చేందుకే నష్టపరిహార సెస్సు అమలును పెంచామని మోదీ సర్కారు చెప్తున్నది. ఈ నేపథ్యంలో గడువు దాటిన తర్వాత సెస్సు సంగతి ఏంటన్నదానిపై ఈ మేరకు ఏర్పాటైన జీవోఎం చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే మరో రెండేండ్లు పొడిగించవచ్చన్న అంచనాలున్నాయి. కానీ రికార్డు స్థాయిలో నెలవారీ జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్న దృష్ట్యా ఈ ఊహాగానాలకు ప్రాధాన్యత ఏర్పడుతున్నదిప్పుడు.