హైదరాబాద్ : అంతర్జాతీయంగా చమురు ధరలు ఇటీవల భారీగా తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా పలుచోట్ల ధరలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూరోపియన్ ప్రాంతంలో కరోనా కేసులు పెరగడం, జపాన్, భారత్ వంటి దేశాల్లో చమురు నిల్వలు ఉండటం, ఈ దేశాల్లో ఓవర్-సప్లై, తక్కువ డిమాండ్ ఉండటం వంటి అంశాలు ప్రభావం చూపనున్నాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్, యూఎస్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధరలు 1 శాతం చొప్పున లాభపడ్డాయి. అక్టోబర్ 1వ తేదీ తర్వాత కనిష్టానికి చేరుకున్న అనంతరం సోమవారం ధరలు పెరిగాయి.
బ్రెంట్ క్రూడ్ 1 శాతం పెరిగి 79.70 డాలర్లకు, యూఎస్ క్రూడ్ 1 శాతం పెరిగి 76.73 డాలర్లకు చేరుకుంది. అయితే యూరోపియన్ ప్రాంతాల్లో కరోనా లాక్ డౌన్ కారణంగా చమురు డిమాండ్ పై ప్రభావం పడి, మున్ముందు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.108.20, లీటర్ డీజిల్ రూ.94.62గా ఉంది. విజయవాడలో ఈరోజు ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పైన 57 పైసలు క్షీణించి రూ.110.36, లీటర్ డీజిల్ పైన 0.51 పైసలు తగ్గి రూ.96.45గా ఉంది.