FPI | న్యూఢిల్లీ, మార్చి 9: గత రెండు నెలలుగా భారీ విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత్ స్టాక్ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఈ మార్చి నెల తొలివారంలో రూ. 11,823 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. మార్చి 7 వరకూ ఈక్విటీతో పాటు డెట్, హైబ్రీడ్ విభాగాల్లో కలిపి మొత్తం రూ. 15,559 కోట్లు పెట్టుబడి చేసినట్టు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (ఎన్ఎస్డీఎల్) డాటా వెల్లడిస్తున్నది.
దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం, భారత్ స్టాక్ మార్కెట్ ఆటుపోట్లకు తట్టుకోవడం వంటి అంశాలతో విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఆకర్షితులవుతున్నారని విశ్లేషకులు చెపుతున్నారు. విధానపరంగా ఎఫ్‌పీఐ డిస్క్లోజర్లను సెబీ సరళీకృతం చేయడం, పెద్ద కార్పొరేట్ల ఆర్థిక పనితీరు ప్రోత్సాహకరంగా ఉండటం సానుకూలాంశాలని బీడీవో ఇండియా పార్టనర్ మనోజ్ పురోహిత్ చెప్పారు.