Foxcomn | పెట్టుబడులపై కేంద్రంతో తైవాన్ ఎలక్ట్రానిక్ మేజర్ ఫాక్స్కాన్ (Foxcomn) సంచలన ప్రకటన చేసింది. తమ కంపెనీ చైర్మన్ ఇటీవల భారత్లో పర్యటించారని, ఉత్పాదక రంగంలో పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై ఫాక్స్కాన్ వివరణ ఇచ్చింది. త్వరలో ఫాక్స్కాన్ కర్ణాటకలో ఐ-ఫోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుందని ఆ రాష్ట్ర సీఎం బస్వరాజు బొమ్మై ట్వీట్ చేసిన నేపథ్యంలో ఆ సంస్థ వివరణకు ప్రాధాన్యం ఏర్పడింది.
గతనెల 27 నుంచి ఈ నెల 4 వరకు హోన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ సారధ్యంలోని ప్రతినిధి బృందం భారత్లో పర్యటించింది. కానీ, యంగ్ లియూ పర్యటనలో భారత ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ఫాక్స్కాన్ వెల్లడించింది.
అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతల మధ్య మాన్యుఫాక్చరింగ్ రంగ సంస్థలు ఆల్టర్నేటివ్ మార్గాలపై దృష్టి కేంద్రీకరించాయి. ఆపిల్ ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్.. భారత్లో ఐ-ఫోన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వార్తలొచ్చాయి. ఆపిల్ ఐ-ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్ బెంగళూరులో ప్లాన్లు రూపొందిస్తుందని, దీనివల్ల లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై శుక్రవారం ట్వీట్ చేశారు. కర్ణాటకలో ఫాక్స్కాన్ కంపెనీ పెట్టుబడి పెట్టనున్నదని పేర్కొంటూ బ్లూంబర్గ్లో వచ్చిన వార్తాకథనాన్ని బొమ్మై ట్వీట్ చేయడంతో ఫాక్స్కాన్ ఈ క్లారిటీ ఇచ్చింది.
కాగా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ నెల రెండో తేదీన ఫాక్స్కాన్ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశం తర్వాత ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ ప్రకటన చేశారు. తమ పెట్టుబడులతో రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ఫాక్స్కాన్ తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నది.