న్యూఢిల్లీ, జనవరి 7: దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీ స్థాయిలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గడిచిన 11 రోజుల్లో ఏకంగా రూ.14,300 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. ఈ విషయాన్ని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసుల చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నతాధికారి వీకే విజయకుమార్ తెలిపారు.
చైనా, యూరప్ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ ఏడాది అధిక రిటర్నులు వచ్చాయని, కానీ దేశీయ ఈక్విటీలు మాత్రం లాభాలను పంచడం లేదన్నారు. దీంతో ఎఫ్ఐఐలు ఇక్కడి పెట్టుబడులను ఉపసంహరించుకొని ఆయా దేశాలకు మళ్లిస్తున్నట్లు చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్లు మరింత బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇదే ట్రెండ్ మరికొన్ని నెలల పాటు కొనసాగనున్నదని,, స్థిరీకరణ జరిగిన తర్వాతనే విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.