Inflation | న్యూఢిల్లీ, నవంబర్ 14: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలూ పెరిగాయి. గత నెలలో 4 నెలల గరిష్ఠాన్ని తాకినట్టు గురువారం విడుదలైన ప్రభుత్వ వివరాల్లో తేలింది. అక్టోబర్లో హోల్సేల్ ద్రవ్యోల్బణం 2.36 శాతంగా నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఈ ఏడాది జూన్ (3.43 శాతం) తర్వాత ఇదే అత్యధికం. సెప్టెంబర్లో 1.84 శాతంగానే ఉన్నది. నిరుడు అక్టోబర్లోనైతే మైనస్ 0.26 శాతమే కావడం గమనార్హం. ఇక ఇప్పటికే అక్టోబర్ నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా 14 నెలల గరిష్ఠ స్థాయిని తాకుతూ 6.21 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రిటైల్ ఇన్ఫ్లేషన్ కట్టడికి పెట్టుకున్న గరిష్ఠ సహన పరిమితి (6 శాతం) కంటే ఎక్కువ.
కూరగాయలు తదితర ఆహారోత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగినట్టు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. తయారీ వస్తూత్పత్తుల రేట్లూ పరుగులు పెట్టాయని స్పష్టమైంది. ఈ క్రమంలోనే హోల్సేల్ మార్కెట్లో ఆహారోత్పత్తుల ధరల సూచీ అక్టోబర్లో 13.54 శాతానికి ఎగిసింది. అంతకుముందు నెల సెప్టెంబర్లో ఇది 11.53 శాతంగా ఉన్నది. కూరగాయల ధరల్లో 63.04 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. సెప్టెంబర్లో ఇది 48.73 శాతం. ముఖ్యంగా ఆలుగడ్డ, ఉల్లిగడ్డ ధరలు 78.73 శాతం, 39.25 శాతం శ్రేణిలోనే కదలాడుతున్నాయి. కాగా, రిటైల్ మార్కెట్లో ఆహారోత్పత్తుల ధరల సూచీ (సీఎఫ్పీఐ) 10.87 శాతానికి ఎగబాకింది.
అటు రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు హోల్సేల్ ద్రవ్యోల్బణం.. రెండూ భారీగా పెరిగిన నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్ల కోతల అంచనాలకు బ్రేక్ పడినైట్టెంది. గత నెల్లోనే ఆర్బీఐ తమ మానిటరీ పాలసీని న్యూట్రల్కు మార్చింది. ఫలితంగా వచ్చే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు ఇక తగ్గే అవకాశాలే ఉన్నాయని అంతా అనుకున్నారు. కానీ తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ ఆశలపై నీళ్లు చల్లినైట్టెంది. డిసెంబర్లో జరుగబోయే ద్రవ్యసమీక్షలోనూ రెపోరేటు యథాతథంగానే ఉండొచ్చంటున్నారు. ఇంకొందరైతే పెరిగేందుకూ ఆస్కారముందన్న అంచనాల్ని వెలిబుచ్చుతున్నారు. ఇదే జరిగితే కీలక రంగాలపై పెను భారం పడినట్టే. కరోనాతో చతికిలపడిన దేశ ఆర్థిక వ్యవస్థలో తిరిగి ఉత్సాహాన్ని నింపేందుకు వరుసగా వడ్డీరేట్లను తగ్గిస్తూపోయిన ఆర్బీఐ.. ఆ తర్వాత విజృంభించిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అదే రీతిలో పెంచుతూపోయిన విషయం తెలిసిందే. ఆపై గత ఏడాది ఏప్రిల్ నుంచి గరిష్ఠ స్థాయిల్లోనే రెపో రేటు (6.50 శాతం)ను ఉంచుతూ వస్తున్నది. మొత్తానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ వడ్డీరేట్ల కోతలకున్న అవకాశాల్ని మరికొన్ని నెలలు వెనక్కి నెడుతున్నదని చెప్పక తప్పదు.