Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలతో ఉలిక్కిపడ్డాయి. వరుస నష్టాల నుంచి సూచీలు కోలుకుంటున్న తరుణంలో టారిఫ్‌ల పిడుగు వచ్చిపడింది. ప్రపంచవ్యాప్తంగా ఇది వాణిజ్య యుద్ధానికి దారితీయగా.. మదుపరుల భయాల నడుమ ఈక్విటీ మార్కెట్లు అంతటా కుప్పకూలిపోయాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 2,050.23 పాయింట్లు లేదా 2.64 శాతం పతనమై 75,364.69 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 614.80 పాయింట్లు లేదా 2.61 శాతం క్షీణించి 22,904.45 దగ్గర స్థిరపడింది.
ఈ నేపథ్యంలో ఈ వారం కూడా ట్రేడ్ వార్ భయాలు మార్కెట్లను వెంటాడుతాయని, ఆయా దేశాలు అమెరికా టారిఫ్‌లపై స్పందించే తీరే కీలకమని మెజారిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైనా దీటుగా స్పందించింది. తమ దేశంలోకి వచ్చే అమెరికా వస్తూత్పత్తులపై 34 శాతం అదనపు సుంకాలుంటాయని ప్రకటించింది. ఈ క్రమంలో మరికొన్ని దేశాలూ ఇదే దిశగా వెళ్తుండగా, ఇంకొన్ని దేశాలు అమెరికాతో చర్చలకు ప్రయత్నిస్తున్నాయి. ఇక ఈ విషయంలో భారత్ ప్రతిస్పందన కూడా స్టాక్ మార్కెట్లకు దిశా-నిర్దేశం చేయగలదు. ఇదిలావుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష కూడా కీలకమే.
ఈ నెల 9న ఆర్బీఐ ద్రవ్యసమీక్ష నిర్ణయాలుంటాయి. గత సమీక్షలో చాలాకాలం తర్వాత రెపోరేటును పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా వడ్డీరేట్ల కోత ఉంటుందన్న అంచనాలే నెలకొన్నాయి. ఇదే జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లకు కొత్త ఉత్సాహం లభించినట్టే అనుకోవచ్చు. అలాకాకపోతే మాత్రం సూచీలు మరింత దిగజారే అవకాశాలే ఎక్కువ. మదుపరులపై అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చు మరి.
ఇక డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలూ దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని చెప్పవచ్చు. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 22,600 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,400 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 23,200-23,500 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదుడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.