Fixed Deposit | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానకమిటీ అనంతరం రెపోరేటు యథాతధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. రేపో రేటు 6.5శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే, ఆర్బీఐ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడం ఇది వరుసగా తొమ్మిదవసారి కావడం విశేషం. చివరిసారిగా గతేడాది ఫిబ్రవరి మాసంలో రెపోరేటును పెంచిన విషయం తెలిసిందే. మరో వైపు రెపోరేటు యథావిధిగా కొనసాగిస్తూ వస్తున్నా.. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం ఇటీవల కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని చాలాసార్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం గరిష్ఠంగా 7.40శాతానికి పెంచాయి. ప్రధాన బ్యాంకుల్లో ఒకటైనా బ్యాంక్ ఆఫ్ బరోడా 399 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై 7.25 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 666 రోజుల డిపాజిట్లపై 7.30 శాతం వడ్డీని, 777 రోజుల డిపాజిట్లపై బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.25 శాతం వడ్డీని, 444 రోజుల డిపాజిట్లపై కెనరా బ్యాంక్ 7.25 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు.
ఇక సెంట్రల్ బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.30శాతం, ఇండియన్ బ్యాంక్ 444 రోజుల డిపాజిట్లపై 7.25 నుంచి వడ్డీని, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 333 రోజుల డిపాజిట్ స్కీమ్‌పై 7.40 శాతం వడ్డీని చెల్లిస్తున్నది. గత రెండు నెలల్లో చాలా ప్రభుత్వ బ్యాంకులు ఎఫ్డీ, రుణాలు రెండింటిపై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే, డిపాజిట్ కంటే బ్యాంకుల రుణాల రేటు పెరుగుతున్నది. దీంతో బ్యాంకుల నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల రుణాల వృద్ధిరేటు 16శాతం కాగా.. డిపాజిట్ల వృద్ధి రేటు 10శాతంగా నమోదైంది. డిపాజిట్ల సమస్యను పరిష్కరించాలని ఆర్బీఐ గురువారం బ్యాంకులకు సూచించింది. మరో వైపు కెనరా బ్యాంక్ అన్ని రుణాలపై వడ్డీని 0.05శాతం పెంచింది. దీంతో గృహ రుణాలు, కన్జ్యూమర్ రుణాలు సహా అన్నింటిపై వడ్డీ భారం పడనున్నది. ఏడాది రుణ రేటు 9శాతం, మూడేళ్ల రుణరేటు 9.40శాతం, రెండేళ్ల రుణరేటు 9.30శాతంగా ఉండనున్నది. నెల, మూడునెలలు, ఆరు నెలల రుణ రేటు 8.35శాతం నుంచి 8.80శాతం మధ్య ఉండనున్నది. కొత్త రేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నాయి.
Nirmala Sitaraman | బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేస్తాం.. ఆర్బీఐ డైరెక్టర్ల సమావేశంలో ఆర్థిక మంత్రి
Cisco Layoffs | AI ఎఫెక్ట్.. సిస్కోలో వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు.. ఆరు నెలల్లో రెండో సారి..!