న్యూఢిల్లీ, మే 2: భారతీయ బీమా రంగంలో సర్కారీ అనుమతుల్లేకుండానే 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తున్నట్టు శనివారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు 74 శాతం వరకే ఎఫ్‌డీఐని అనుమతించేవారు. అయితే ఆటోమెటిక్ రూట్లో 100 శాతానికి పెంచాలంటూ ‘సబ్కా బీమా, సబ్కీ రక్ష’ పేరిట తెచ్చిన బీమా చట్టాల సవరణ బిల్లు-2025కు గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రపతి నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో.. చట్టరూపం దాల్చింది. ఈ క్రమంలోనే ఇందుకు తగ్గట్టుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ (డీపీఐఐటీ) బీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐకి అనుమతులు ఇస్తున్నట్టు ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ విధివిధానాలను క్రమబద్ధం చేసింది.
పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ద్వారా వచ్చే విదేశీ పెట్టుబడులు సహా భారతీయ బీమా కంపెనీలు, ఇంటర్మీడియరీల్లో ఇకపై 100 శాతం పెయిడ్-అప్ ఈక్విటీ క్యాపిటల్ ఉండొచ్చని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బ్రోకర్లు, రీఇన్సూరెన్స్ బ్రోకర్లు, కార్పొరేట్ ఏజెంట్లు, కన్సల్టెంట్లు, సర్వేయర్లు, థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్లు, ఇన్సూరెన్స్ రెపోజిటరీలు తదితర ఇంటర్మీడియరీల్లోనూ 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తున్నట్టు ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్ (రుణేతర సాధనాలు) రెండో సవరణ రూల్స్ 2026లో స్పష్టం చేసింది. అయితే ఫెమా చట్టం కింద రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు, బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ మార్గదర్శకాలకు లోబడి ఉండాల్సిందేనన్నది. అలాగే దేశీయంగా బీమా సంస్థను పెట్టాలనుకొనే విదేశీయులు.. సదరు కంపెనీలో చైర్మన్, ఎండీ, సీఈవోగా భారతీయులనే నియమించాలన్న నిబంధననూ గుర్తుచేసింది. నిజానికి ‘సబ్కా బీమా, సబ్కీ రక్ష’లో చాలా నిబంధనలు (సెక్షన్ 25 మినహా) ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచే అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఆర్థిక శాఖ ప్రకటనతో పూర్తి స్థాయిలో ఆచరణలోకి వచ్చినైట్టెంది.
చైనా/హాంకాంగ్‌లకు చెందిన మదుపర్లు, కంపెనీలకు 10 శాతం వరకు వాటాలున్న విదేశీ సంస్థలూ ఇకపై ఆటోమేటిక్ రూట్లో భారత్‌లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మే 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అందుకు తగ్గట్టుగా ఫెమా కింద చేసిన మార్పులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. అయినప్పటికీ చైనా లేదా హాంకాంగ్, భారత్‌తో సరిహద్దు కలిగిన ఇతర దేశాల్లో నమోదైన సంస్థలకు సవరించిన ఈ ఎఫ్‌డీఐ రూల్స్ వర్తించబోవని స్పష్టం చేసింది. నిజానికి చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్, అఫ్గానిస్థాన్ వంటి భారత్‌కు పొరుగున ఉన్న దేశాలకు (కంపెనీలు లేదా వ్యక్తులు) విదేశీ సంస్థల్లో ఒక్క షేర్ ఉన్నా.. ఆ కంపెనీలు భారత్‌లోని ఏ రంగంలోనైనాసరే పెట్టుబడి పెట్టాలంటే అనుమతి తప్పనిసరి. అయితే ఇప్పుడు ఈ ఆంక్షలు కేవలం లబ్ధి పొందే యాజమాన్యాలకు మాత్రమే. అంటే మెజారిటీ వాటాలు ఆయా దేశాలకు ఉంటే.. ఆటోమేటిక్ రూట్లో భారత్‌లో ఆ సంస్థలు పెట్టుబడులు పెట్టలేవన్నమాట. 10 శాతం వరకు వాటాలుంటే ఆటోమేటిక్ మార్గంలో భారత్‌లోకి రావచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
దేశీయ బీమా రంగంలోకి 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతించినా.. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోకి మాత్రం ఎఫ్‌డీఐని 20 శాతానికే కేంద్రం పరిమితం చేసింది. ఇందుకు ఎల్ఐసీకి ఉన్న ప్రత్యేక చట్టమే కారణమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ చట్టాన్ని సవరించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యే అవకాశాలు లేకపోవడం, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే మోదీ సర్కార్ వెనుకడుగు వేసిందన్న అంచనాలున్నాయి. మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ నాయకత్వానికి ఈ దఫా కావాల్సినంత మెజారిటీ లేదన్న సంగతి విదితమే. అందుకే దేశ ప్రజల బీమా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొనే ఎల్ఐసీలో ఎఫ్‌డీఐ విషయంలో ఎలాంటి మార్పులు చేయట్లేదని అధికారపక్షం చెప్పుకొంటున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.