EV Battery Charging | పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం ఆల్టర్నేటివ్ మొబిలిటీ ఆప్షన్ల వైపు యావత్ ప్రపంచం మళ్లుతోంది. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వైపు ప్రతి ఒక్కరూ అడుగులేస్తున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ వినియోగ వాహనాలకు ఫ్యుయల్ స్టేషన్ల మాదిరిగా ఈవీ వాహనాలు నడవాలంటే విద్యుత్ అవసరం.. ఈవీ వాహనాల్లోని బ్యాటరీలను విద్యుత్ తో చార్జింగ్ చేస్తేనే నడుపొచ్చు. కానీ, దేశీయంగా.. అంతర్జాతీయంగా ఈవీ చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వసతులు అంతగా లేవు. కానీ ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చెబుతోంది దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్. కేవలం తొమ్మిది నిమిషాల చార్జింగ్‌తో 1000 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం గల బ్యాటరీని ఆవిష్కరించింది శాంసంగ్. సియోల్ లో జరిగిన ఎస్ఎన్ఈ బ్యాటరీ డే -2024 ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించింది. పూర్తిగా దక్షిణ కొరియా టెక్నాలజీతో అభివృద్ధి చేసిన బ్యాటరీ సక్సెస్ అయితే ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు అడుగులేయడానికి ఇబ్బందులే ఉండవు.
సంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీకి బదులు సాలిడ్ మెటీరియల్‌తోపాటు లిక్విడ్ ఎలక్ట్రోలైట్స్ తో తయారు చేసిన బ్యాటరీ ఇది. ఇది విజయవంతమైతే సేఫ్టీ పెంపుతోపాటు బరువు తగ్గుతుంది. ఎనర్జీ డెన్సిటీ పెంచుతుంది. ప్రస్తుతం ఈవీ కార్లలో వాడుతున్నవి ‘270 కిలోవాట్స్ ఫర్ కిలో’ ఈవీ బ్యాటరీలు. కానీ శాంసంగ్ ఆవిష్కరించిన ప్రొటోటైప్ ఈవీ బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ ‘500కిలోవాట్స్ ఫర్ కిలో’. అంతే కాదు ఈ బ్యాటరీల లైఫ్ స్పాన్ 20 ఏండ్లు ఉంటుంది.
ప్రస్తుతం ఈవీ బ్యాటరీల చార్జింగ్ కోసం ఒక్కో వాహనానికి 30 నిమిషాల నుంచి కొన్ని నిమిషాలు పడుతుంది. అదీ కూడా బ్యాటరీ కెపాసిటీ, చార్జింగ్ స్టేషన్ బట్టి ఉంటుంది. ప్రస్తుతం భారత్ లో టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జడ్ఎస్ ఈవీ వంటి రెండు పాపులర్ మోడల్ కార్ల బ్యాటరీలను ఫాస్ట్ చార్జర్ల సాయంతో 80 శాతం చార్జింగ్ చేయాలన్నా సుమారు 60 నిమిషాల టైం పడుతుంది.
2027 నాటికి భారీ స్థాయిలో ఆల్ సాలిడ్ స్టేట్ బ్యాటరీలను నిర్మించడానికి గతేడాది పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం అని శాంసంగ్ ఎస్డీఐ తెలిపింది. తొలి దశలో తయారు చేసిన బ్యాటరీలను ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి డెలివరీ చేశామని, వాటి వినియోగంపై యూజర్ల నుంచి అద్భుతమైన పాజిటివ్ ప్రతిస్పందన వచ్చిందని సమాచారం. దేశీయ ఈవీ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కూడా మెరుగైన ఈవీ బ్యాటరీలను, వాటికి అవసరమైన చార్జర్లను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు తెలుస్తున్నది.