ముంబై, మే 20: విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) భారతీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడులను క్రమేణా తగ్గించుకుంటున్నారు. ముఖ్యంగా పెద్ద సంస్థల్లో పెద్ద ఎత్తున వాటాలను దించుకుంటుండటం గమనార్హం. ఈ క్రమంలోనే టాప్-10 కంపెనీల్లో ఒకప్పుడు నిర్ణయాత్మక స్థాయిలో ఉన్న ఎఫ్ఐఐల పెట్టుబడుల పరిమాణం.. ఇప్పుడు సగానికి హరించుకుపోయింది. 2022 మార్చిలో టాప్-10 స్టాక్స్‌లో ఎఫ్ఐఐల వాటా 40.80 శాతంగా ఉండేది. ఈ ఏడాది మార్చిలో అది 21.20 శాతానికి దిగజారింది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో ఎఫ్ఐఐల వాటాలు 14 ఏండ్ల కనిష్ఠాన్ని తాకుతూ దాదాపు 14.70 శాతానికి పతనమయ్యాయి. కొన్నేండ్ల క్రితం సుమారు 18 శాతంగా ఉండేవి. అలాగే ఎమ్ఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ 12 శాతానికిపైగా క్షీణించింది. రెండేండ్ల క్రితం 20 శాతానికిపైగా ఉండేది. ఇక దేశీయ అగ్రశ్రేణి సంస్థల నుంచి తమ పెట్టుబడులను వెనుకకు తీసుకుంటున్న ఎఫ్ఐఐలు.. ఇక్కడి మధ్య, చిన్న శ్రేణి సంస్థల్లోకి వాటిని తీసుకొచ్చిన దాఖలాలూ అంతంతమాత్రమేనని ట్రస్ట్‌లైన్ హోల్డింగ్స్ సీఈవో ఎన్ అరుణగిరి అంటున్నారు. అయితే ఈ పెట్టుబడులను విదేశాల్లోని సంస్థలకు మళ్లించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు చెప్పారు. కాగా, 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి దూరంగా జరుగడం మొదలుపెట్టిన ఎఫ్ఐఐలు.. ఇప్పుడు అమెరికా-ఇరాన్ వార్తో మరింత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం.
ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగేండ్లలో ఎఫ్ఐఐలు దూరం పెట్టిన టాప్-10 భారీ కంపెనీల షేర్లలో ఐటీ, ఆర్థిక రంగ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా షేర్లలో వాటాలు 7.70 శాతం తగ్గాయి. ఆ తర్వాత హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్‌ల్లో ఎఫ్ఐఐ వాటాలు 6.60 శాతం పడిపోయాయి. ఇక డాలర్‌తో పోల్చితే దిగజారుతున్న రూపాయి మారకం విలువ సైతం ఎఫ్ఐఐలను పెట్టుబడుల ఉపసంహరణ వైపునకు నడిపిస్తున్నది. 2022 మార్చి నుంచి 2026 మార్చి మధ్య నిఫ్టీ రాబడులు కేవలం 35 శాతంగానే ఉన్నాయి. ఎస్అండ్పీ 500లో 60 శాతానికిపైగా రిటర్న్స్ వచ్చాయి. దీంతో భారతీయ ఈక్విటీల కంటే విదేశీ ఈక్విటీలే నయమన్న భావన ఎఫ్ఐఐల్లో బలపడుతున్నది.
పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు బుధవారం మదుపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. కంపెనీ షేర్ వాల్యూ గరిష్ఠంగా 5 శాతానికి ఎగిసి అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ.5.25గా నమోదైంది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇటలీ ప్రధాని మెలోనీకి బహుమతిగా మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్ ఇవ్వడమే కారణం. ఇరువురు పేర్లను కలిపితే వచ్చే ఆ సంక్షిప్త రూపానికి దగ్గరగా ఆ చాక్లెట్ల పేరుండటం, వాటిని పార్లే ప్రొడక్ట్స్ కంపెనీ తయారు చేస్తుండటం కలిసొచ్చింది. కొసమెరుపు ఏంటంటే పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు, పార్లే ప్రొడక్ట్స్ కంపెనీకి సంబంధమే లేకపోవడం. మదుపర్లు భ్రమపడి ఎగబడి కొనేశారు. పార్లే ఇండస్ట్రీస్ లిమిటెడ్.. ఇన్ఫ్రా, రియల్టీ, పేపర్, వేస్ట్ పేపర్ దాని అనుబంధ ఉత్పత్తుల తయారీ వ్యాపారంలో ఉన్నది. ఇక పార్లే ప్రొడక్ట్స్ నుంచి వస్తున్న ఉత్పత్తుల విషయానికొస్తే.. మెలోడీ, కచ్చా మ్యాంగో బైట్ చాక్లెట్లతోపాటు పార్లే-జీ, మోనాకో, క్రాక్‌జాక్, హైడ్ అండ్ సీక్ బిస్కట్లను తయారు చేస్తున్నది. ఈ సంస్థ స్టాక్ మార్కెట్లలో నమోదు కాలేదు.
