Gold | న్యూఢిల్లీ, మార్చి 22: కిలో బంగారం ఉంటే ఓ ప్రైవేట్ జెట్‌నే సొంతం చేసుకోవచ్చా? అంటే అవుననే చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ‘గోల్డ్ ఈజ్ ఎవర్గ్రీన్’ అనే అంటున్నారు మరి. కాలం గడుస్తున్నకొద్దీ కనకం ఏ రీతిలో మెరిసిపోయిందో లెక్కలతోసహా గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలోనే 1990లో కిలో పసిడి ధర.. మారుతీ 800కు సమానమని, అలాగే 2000లో మారుతీ ఎస్టీమ్, 2005లో ఇన్నోవా, 2010లో ఫార్చునర్ రేట్లకు సమానంగా పెరిగిందని వివరిస్తున్నారు. ఇక 2019లో కేజీ పుత్తడికి వెచ్చించే సొమ్ముతో బీఎండబ్ల్యూ ఎక్స్1ను సొంతం చేసుకోవచ్చన్న ఎక్స్పర్ట్స్.. 2040కల్లా ఏకంగా ఓ ప్రైవేట్ జెట్‌ను కొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తుండటం గమనార్హం. అంటే మరో 15 ఏండ్లలో కిలో బంగారం ధర భారత్‌లో రూ.20 కోట్లపైనేనని, తులం రూ.20 లక్షలమీదేనని చెప్పకనే చెప్తున్నారు.
అంతర్జాతీయంగా గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ మునుపెన్నడూ లేనివిధంగా 3,065.09 డాలర్లు పలికింది. ఇదే క్రమంలో దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత)ఆల్‌టైమ్ హైని తాకుతూ రూ.91,950గా నమోదైంది. దేశ, విదేశీ ప్రతికూల ఆర్థిక పరిస్థితులు, ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధం వంటివి మదుపరులను స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణలకు ప్రోత్సహిస్తున్నాయి. పెట్టుబడుల రక్షణార్థం బంగారంపైకి మళ్లిస్తుండటంతో ధరలు పైపైకే వెళ్తున్నాయి.
సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజా అంచనాలు మిక్కిలి ప్రాధాన్యాన్నే సంతరించుకున్నాయి. నిజానికి గడిచిన 20 ఏండ్లలో ఎస్అండ్పీ 500 ఇండెక్స్‌లో స్టాక్స్ 11 శాతం మాత్రమే రిటర్న్స్‌ను ఇన్వెస్టర్లకు అందించాయి. అయితే గత 25 ఏండ్లుగా బంగారం 12.55 శాతం వార్షిక రాబడులను ఇచ్చింది. ఇది భవిష్యత్తులో మరింతగా పెరగవచ్చని బలమైన అంచనాలు వినిపిస్తున్నాయి.