ముంబై, నవంబర్ 14 : వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మునుపెన్నడూలేని స్థాయికి తగ్గింది. గత నెలలో ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని సూచిస్తూ 0.25 శాతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో తాజాగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత హోల్‌సేల్ ద్రవ్యోల్బణం కూడా 27 నెలల కనిష్ఠాన్ని తాకుతూ అక్టోబర్‌లో మైనస్ 1.21 శాతానికి దిగింది. దీంతో ఇప్పుడు రాబోయే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లకు తప్పక కోతలు పెడుతుందన్న అంచనాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వచ్చే నెల డిసెంబర్లో ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగనున్నది. దాంతో ఈసారి రెపోరేటును పావు శాతం నుంచి అర శాతం మేరకు సెంట్రల్ బ్యాంక్ తగ్గించే అవకాశాలే ఎక్కువన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రెపోరేటును ఆర్బీఐ 1 శాతం (100 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. అయితే గత రెండు ద్రవ్యసమీక్షల్లో రేట్ల కోతలకు రిజర్వ్ బ్యాంక్ దూరంగానే ఉంటూ వస్తున్నది. దీంతో ఈసారి కోత ఖాయమనే అత్యధికులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపోరేటు 5.50 శాతంగా ఉన్న సంగతి విదితమే.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్బీఐ అంచనాలకు దిగువనే ఉంటాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈసారి 2.6 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2 శాతానికే పరిమితం కావచ్చని ఎకనామిస్టులు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈసారి వర్షాలు దేశవ్యాప్తంగా సమృద్ధిగానే కురిశాయని, దాంతో పంటల దిగుబడి ఆశించిన స్థాయిలోనే ఉంటుందని, ఆహార ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపులు, అంతర్జాతీయ మార్కెట్లో దిగొస్తున్న ముడి చమురు ధరలు వంటివి ఇందుకు దోహదం చేయగలవని వారు పేర్కొంటున్నారు. గత ఏడాదిదాకా ద్రవ్యోల్బణం అదుపే ధ్యేయంగా ఆర్బీఐ వడ్డీరేట్లను సవరిస్తూపోయిన విషయం తెలిసిందే.
అయితే ఆర్బీఐకి కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా వచ్చిన దగ్గర్నుంచి అంతా సర్దుకున్నది. ఈ క్రమంలోనే వరుస ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును తగ్గించేశారు. కానీ బ్యాంకర్లు (రుణదాతలు) ఈ ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు ఆ స్థాయిలో అందివ్వడం లేదంటూ వాపోయింది. దీంతో తర్వాతి ద్రవ్యసమీక్షల్లో వడ్డీరేట్ల కోతలకు బదులుగా.. మార్కెట్లో రుణలభ్యత పెరిగేందుకు ఇతర సాధనాలను ఆర్బీఐ వినియోగించింది. అయితే అంతర్జాతీయ పరిణామాలతో దేశ జీడీపీ వృద్ధిరేటు రిస్క్‌లో పడే వీలుందన్న సంకేతాలు వస్తున్నాయిప్పుడు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3-5 తేదీల్లో జరిగే ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తప్పక రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి. తద్వారా కొనుగోలు సామర్థ్యాన్ని పెంచి, మార్కెట్‌కు నూతనోత్సాహం అందిస్తుందన్న అభిప్రాయాలున్నాయి.

ఈ ఏడాది ఆరంభంతో పోల్చితే ఇప్పుడు బ్యాంక్ రుణాలపై వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయి. వచ్చే ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తే ఇంకా తగ్గనున్నాయి. దీంతో రుణగ్రహీతలపై ఈఎంఐల భారం మరింత దిగిరానున్నది. ఇదే జరిగితే వాహన, గృహ, కన్జ్యూమర్ గూడ్స్ తదితర రంగాలకు గొప్ప ఉత్సాహమేనని చెప్పవచ్చు. ఆయా ప్రధాన రంగాలతోపాటు, వాటి అనుబంధ రంగాల్లోనూ ఉత్పత్తి, వినీమయం పెరుగుతాయని వ్యాపారులు చెప్తున్నారు. దీనివల్ల ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, అంతిమంగా దేశ ఆర్థిక వృద్ధిరేటు పరుగులు పెట్టగలదని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అలాగే ఈసారి రెపోరేటుకు ఆర్బీఐ కోత పెడితే.. బ్యాంకులు కూడా ఆ మేరకు తగ్గించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని, దానివల్ల ఇంకా సత్ఫలితాలుంటాయని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి. రిటైల్ రుణాలపై వడ్డీరేట్లు తగ్గితే అమ్మకాలు పెరుగుతాయని చెప్తున్నారు.