Union Budget 2025 | వచ్చే ఆరేండ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి సంపన్న దేశాల్లో ఒకటిగా భారత్‌ను నిలిపేందుకు ‘వికసిత్ భారత్ విజన్’తో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ అడుగులు వేస్తున్నది. అయినా దేశ ఆర్థిక వ్యవస్థకు నిరుద్యోగ సమస్య ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. గత మూడేండ్లుగా ఎనిమిది శాతానికి పరిమితమైన నిరుద్యోగ సమస్య.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశం. నిరుద్యోగ సమస్యపై ఒక ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 50 శాతానికి పైగా వ్యక్తులు దేశ ఆర్థిక వ్యవస్థకు నిరుద్యోగం ప్రధాన సవాల్ గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 9,500 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. 51.8 శాతం మంది ప్రధాన సమస్య నిరుద్యోగమేనని తేల్చి చెప్పారు. 24.3 శాతం వ్యక్తులు అసమానతలు ప్రధానంగా ఆందోళన కలిగిస్తున్న అంశం అని పేర్కొన్నారు. 16.3 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన సవాల్ అని చెబితే, 7.6 శాతం మంది పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడాలని వ్యాఖ్యానించారు.
ఆర్బీఐ క్లెమ్స్ డేటా ప్రకారం ప్రతి నెలా 38 లక్షల మంది చొప్పున 2023-24 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 4.7 కోట్ల మందికి ఉద్యోగాలు లభించాయని తెలుస్తున్నది. కానీ, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదిక మాత్రం 80 శాతానికి పైగా భారతీయ యువత నిరుద్యోగులుగా ఉన్నారని చెబుతోంది. ఏడు శాతం వృద్ధిరేటుకు అనుగుణంగా ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
సంపన్న దేశంగా భారత్ ఆవిర్భవించాలంటే 33.3 శాతం మంది కార్మిక శక్తి నైపుణ్యం మెరుగు పర్చాలని కోరారు. 26.3 శాతం మంది శరవేగంగా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటే.. 7.2 శాతం మంది ప్రభుత్వ వ్యయం పెంచడం కీలకం అని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థలు, వ్యక్తులకు ఇన్సెంటివ్ లు ఇవ్వాలని 51.4 శాతం మంది కోరుతున్నారు. ఎంఎస్ఎంఈలను నెలకొల్పాలని, తద్వారా ఉద్యోగాల కల్పన పెరుగుతుందని 32.2 శాతం, ముద్ర రుణాల కల్పన మెరుగు పరుస్తుందని 4.3 శాతం మంది, ప్రభుత్వోద్యోగాలు పెంచాలని 9.5 శాతం మంది కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కల్పించే పారిశ్రామిక రంగాలకు ఇన్సెంటివ్ లు ఇచ్చే అంశం బడ్జెట్ లో చోటు చేసుకుంటుందని భావిస్తున్నారు.