ముంబై, జూలై 9: దేశీయ స్టాక్ మార్కెట్ల ఆల్‌టైమ్ హై పరుగుల నడుమ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లోకి గత నెల రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది మే నెలతో పోల్చితే 17 శాతం పెరిగాయి మరి. మంగళవారం దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ సంఘం యాంఫీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ జూన్‌లో రూ.40,608 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ ఎంఎఫ్‌ల్లోకి రావడం జరిగింది.
ఇందులో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్‌లు)లోకి వచ్చినవి రూ.21,262 కోట్లుగా ఉన్నాయి. ఇదీ రికార్డే. మే నెలలో ఇవి రూ.20,904 కోట్లుగా నమోదయ్యాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో పోయిన పెట్టుబడుల కంటే వచ్చిన పెట్టుబడులే ఎక్కువంటున్న ఇండస్ట్రీ వర్గాలు.. జూన్‌లో మాత్రం వచ్చినదానికన్నా పోయినవే అధికమని, రూ.43,637 కోట్ల పెట్టుబడులు తరలిపోయాయని చెప్తున్నాయి.
కొత్తగా 55 లక్షల సిప్‌లు
ఈక్విటీ పథకాలపై మొత్తం ఎంఎఫ్ ఇండస్ట్రీ నిర్వహణలో ఉన్న నికర ఆస్తులు రూ.27.67 లక్షల కోట్లు. సిప్‌లకు సంబంధించి రూ.12.43 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత నెల కొత్తగా 55 లక్షల సిప్‌లు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 8.98 కోట్లకు చేరింది. 32.35 లక్షల సిప్‌లు మెచ్యూర్ లేదా మూతబడ్డాయని యాంఫీ సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. ఇక మొత్తం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిర్వహణలోని ఆస్తులు జూన్ నాటికి రూ.61.15 లక్షల కోట్లపైనే. మే నెలాఖరుతో చూస్తే దాదాపు 4 శాతం అధికం.
రుణ పథకాల్లో..
అడ్వాన్స్ ట్యాక్స్ రిడెంప్షన్స్ కారణంగా రుణ పథకాల నుంచి జూన్‌లో రూ.1.07 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని యాంఫీ సీఈవో వెంకట్ తెలిపారు. దీంతో జూన్ 30 నాటికి డెట్ స్కీముల నిర్వహణలోని ఆస్తులు రూ.14.13 లక్షల కోట్లకు పడిపోయాయని చెప్పారు. ఇక లార్జ్‌క్యాప్ స్కీముల్లో పెట్టుబడుల రాక రూ.970 కోట్లకు చేరింది. అయితే వాల్యుయేషన్స్ గురించి ఆందోళనలున్నా.. స్మాల్‌క్యాప్ స్కీముల్లోకి రూ.2,263 కోట్లు, మిడ్‌క్యాప్ స్కీముల్లోకి రూ.2,527 కోట్లు రావడం గమనార్హం.
ఇతర స్కీముల విషయానికొస్తే.. హైబ్రిడ్ సెగ్మెంట్లోకి రూ.8,854 కోట్లు రాగా.. ఓవరాల్‌గా వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.8.09 లక్షల కోట్లకు చేరాయి. ప్యాసివ్ స్కీముల నిర్వహణలోని ఆస్తులు రూ.10 లక్షల కోట్ల మార్కును దాటినట్టు వెంకట్ వెల్లడించారు. బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) హోల్డింగ్స్ కలిసొచ్చాయన్నారు.