న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) పెట్టుబడులు వరుసగా రెండో నెలా పడిపోయాయి. గత నెల సెప్టెంబర్లో రూ.30,421 కోట్లకే పరిమితమైనట్టు శుక్రవారం భారతీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. అంతకుముందు నెల ఆగస్టులో ఇవి రూ.33,430 కోట్లుగా ఉండగా.. 9 శాతం దిగజారినైట్టెంది. అయితే జూలైలో ఆల్టైమ్ హైని తాకుతూ రూ.42,703 కోట్లుగా ఉండటం గమనార్హం.
కాగా, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న తీవ్ర ఒడిదొడుకులు.. ఇన్వెస్టర్లను ప్రభావితం చేస్తున్నాయన్న అంచనాలున్నాయి. అయినప్పటికీ ఈక్విటీ స్కీముల్లోకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులు రావడం వరుసగా ఇది 55వ నెల అని యాంఫీ తెలిపింది. అయితే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్)కు ఆదరణ ఉందని, సెప్టెంబర్లో వీటి వాటా రూ.29,361 కోట్లని పేర్కొన్నది. ఆగస్టులో రూ.28,265 కోట్లేనని గుర్తుచేసింది.
మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్లోనైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే దాని గురించి విస్తృత పరిశోధనలు చేస్తాయి. అలాగే దీర్ఘకాలిక వృద్ధిపైనే దృష్టి పెడుతాయి. అయితే దాదాపు గడిచిన ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టిన సుమారు 40 షేర్లు మదుపరులకు నష్టాలనే పంచడం గమనార్హం. ఇందులో టాప్-10 షేర్లు తమ 52 వారాల గరిష్ఠ స్థాయిల నుంచి 40 నుంచి 51 శాతం విలువను కోల్పోయాయి. మిగతావి 25 శాతం వరకు నష్టాల్లో కూరుకుపోయాయి. నిజానికి నష్టాలు వాటిల్లుతున్నా నిరుడు సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు గమనిస్తే.. ప్రతీ త్రైమాసికంలో కొంతమేర ఈ షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెరుగుతూపోవడమే తప్ప తరిగిన సందర్భాలు లేకపోవడం విశేషం. ఇది లాభదాయకమేనా? అంటే.. కాలమే సమాధానం చెప్పాలి.