Investers Wealth | అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం ప్రభావంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపర్లు రూ.5.27 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 422.59 పాయింట్లు (0.54 శాతం) కోల్పోయి 77,155.79 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్గత ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 775.65 పాయింట్లు నష్టపోయి 76,802.73 పాయింట్ల కనిష్టానికి చేరుకున్నది. ఫలితంగా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,27,767.57 కోట్లు నష్టపోయి రూ.4,25,38,908.01 (5.04 లక్షల కోట్ల డాలర్లు) కోట్లకు పడిపోయింది.
సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఆమోదించేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు సుమారు రూ.2200 కోట్ల ముడుపులు ఇచ్చారని యూఎస్ న్యూయార్క్ కోర్టులో గౌతం అదానీపై కేసు నమోదు కావడంతో అదానీ పోర్ట్స్ షేర్ 13.53 శాతం నష్టపోయింది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ భారీగా పతనం అయ్యాయి. వీటితోపాటు ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ భారీగా నష్టపోయాయి. మరోవైపు పవర్ గ్రిడ్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంకు లాభ పడ్డాయి. ఇదిలా ఉంటే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మంగళవారం రూ.3,411.73 కోట్ల విలువైన షేర్లు విక్రయించడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలహీన పరిచింది.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ -100 0.67 శాతం, బీఎస్ఈ మిడ్ క్యాప్-100 0.37 శాతం నష్టపోయాయి. ఇక బీఎస్ఈ సర్వీసెస్ 4.14 శాతం, యుటిలిటీస్ 3.16 శాతం, కమొడిటీస్ 1.55 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.45 శాతం, విద్యుత్ 1.34 శాతం, ఆటో 0.91 శాతం నష్టపోయాయి. మరోవైపు ఐటీ, రియాల్టీ, టెక్ ఇండెక్సులు లాభ పడ్డాయి. బీఎస్ఈలో 2,736 స్టాక్స్ నష్టపోగా, 1237 స్టాక్స్ లాభాలతో ముగిశాయి. మరో 92 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.