EPFO | పెన్షనర్లకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ శాఖలు, విభాగాల పరిధిలో ఉన్న పెన్షనర్లందరికీ ఒకే వ్యవస్థ ద్వారా ఒకేసారి పెన్షన్ పంపిణీ చేసే దిశగా అడుగులేస్తున్నది. ఈ నెల 29,30 తేదీల్లో జరిగే సమావేశంలో ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకోనున్నది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 73 లక్షల మందికి పైగా పెన్షనర్లకు బెనిఫిట్ కలుగుతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)కు చెందిన 138 రీజినల్ ఆఫీసుల ఆధ్వర్వంలో లబ్ధిదారులకు వేర్వేరుగా పెన్షన్ పంపిణీ చేస్తున్నాయి. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు తేదీల్లో ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతున్నది.
వేర్వేరు పెన్షన్ల పంపిణీ విధానానికి బదులు సెంట్రల్ పెన్షన్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఈపీఎఫ్‌వో ప్రతిపాదిస్తున్నది. ఈ ప్రతిపాదనను ఈ నెల 29,30 తేదీల్లో జరిగే ఈపీఎఫ్‌వో అపెక్స్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో తీసుకు రానున్నారు. ఇక ఆరు నెలలకు పైగా ఈపీఎఫ్‌వోలో ఖాతా కలిగి ఉన్న సభ్యుడు తమ డిపాజిట్ విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఆరు నెలల నుంచి 10 ఏండ్ల వరకు ఈపీఎఫ్‌వో ఖాతాలో నగదు జమ చేసిన వారికి మాత్రమే పీఎఫ్ విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంది.